కట్టుకథతో మృతదేహం తరలింపు

విజయవాడ: పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భర్త కట్టుకున్న భార్యను హతమార్చి, రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కట్టుకథ అల్లిన వైనం వెలుగు చూసింది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం రంగంపేటకు చెందిన బొంగు రవికుమార్‌కు అదే జిల్లా పిరిడి గ్రామానికి చెందిన సత్యవతితో 2006లో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. రవికుమార్‌ తన భార్య సత్యవతిని (30) ఈ నెల 5వ తేదీన విజయవాడ మురళీనగర్‌లో హత్యచేసి గుట్టుచప్పుడు గాకుండా మృతదేహాన్ని విజయనగరం జిల్లాకు తరలించాడు. మృతురాలి రక్తబంధువులకు ఆలస్యంగా అందిన సమాచారంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయట పడింది.

విజయవాడ లబ్బీపేట కార్వే ఫైనాన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న రవికుమార్, కానూరు మరళీనగర్‌ కృష్ణవేణి రెసిడెన్సీలో తన భార్య సత్యవతితో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ ఉదయం 6.30 గంటల సమయంలో సత్యవతి చనిపోయిందని హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోదరికి, విజయనగరం జిల్లాలో ఉంటున్న తండ్రికి ఫోన్‌చేసి తెలిపాడు. పాలప్యాకెట్‌కు వెళ్లిన భార్య ఎంతకూ తిరిగి రాలేదని,  తాను వెతుక్కుంటూ వెళ్లగా ఆమె పక్క వీధిలో రోడ్డుపక్కనే చనిపోయి ఉందని వివరించాడు. ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఆమె చనిపోయిందని కట్టుకథ అల్లాడు.

ఫిర్యాదు నమోదు చేశాం: సీఐ
సత్యవతి మృతిపై ఈ నెల 11న ఫిర్యాదు వచ్చిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెనమలూరు సీఐ దామోదర్‌ సాక్షికి చెప్పారు. ఈ నెల 5వ తేదీన చనిపోతే కనీసం రోడ్డుప్రమాదంలో చనిపోయినట్లు కూడా ఫిర్యాదు రాలేదన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉందన్నారు.  

విజయనగరం జిల్లాలో మృతురాలికి అంత్యక్రియలు
భర్త రవికుమార్‌ తన స్వస్థలమైన విజయనగరం జిల్లా సీతానగరం మండలం రంగంపేటకు ప్రైవేట్‌ అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించాడు. ఈ నెల 6వ తేదీన ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపాడు. అంత్యక్రియలకు వెళ్లిన మృతురాలి బంధువులు సత్యవతి మృతి గురించి పూర్తి వివరాలు ఆమె భర్తను ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని, పోలీసు సీఐతో చెప్పి కాగితాలు తీసుకుని అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించానని నమ్మబలికాడు. సంబంధిత కాగితాలు అడగ్గా అనుమానాస్పదంగా మాట్లాడటంతో మృతురాలి సోదరి భూలక్ష్మి, ఇతర బంధువులు మురళీనగర్‌కు వచ్చి సత్యవతి మృతిపై ఆరా తీశారు.

రోడ్డు ప్రమాదం జరిగిన విషయం ఎవ్వరూ చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన భూలక్ష్మి ఈ నెల 11వ తేదీన పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త రవికుమార్‌ 4వ తేదీ రాత్రి సత్యవతితో గొడవ పెట్టుకుని దాడిచేసి కొట్టాడని, ఆమె తలకు గాయమైందని భూలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సోదరి కొద్దిరోజుల కిందట ఫోన్‌ చేసి రవికుమార్‌ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ తనను హింసిస్తున్నట్లు చెప్పిందని భూలక్ష్మి పేర్కొంది. తన సోదరి సత్యవతిని ఆమె భర్త హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని, ఈ కేసును సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె పోలీసు అధికారులను వేడుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top