రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ పాట పాడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు
హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ పాట పాడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగానే ఈ కొత్తవాదాన్ని తెరమీదకు తెచ్చిందని ఆమె సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రజలు ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.
రాజకీయ ఉనికి, వ్యాపారాల కోసమే కొందరు నేతలు రాయలసీమను విడగొట్టే కుట్రచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వాళ్లు వ్యతిరేకిస్తున్నా..... వారితోనే కలపండంటూ రాయలసీమ కాంగ్రెస్ నేతలు బతిమాలుతూ రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారని శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు.
రాయలసీమను చీల్చే హక్కు ఎవరిచ్చారని.... ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్ను గౌరవించారా అని శోభా సూటిగా ప్రశ్నించారు. సమైక్యంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందని, విడదీస్తే శాశ్వతంగా నష్టపోతామన్నారు. తెలంగాణ నేతలు కలపొద్దంటే... సీమ నేతలు కలపాలనడం దారుణమన్నారు.
సీఎం, బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కూడా రాష్ట్ర విభజనకు సహకరించటం దారుణమన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి సమైక్యం కోసం పోరాడాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దెబ్బ తీయడానికే ఈ విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆమె పేర్కొన్నారు.