పోలీస్‌స్టేషన్‌లో దౌర్జన్యం

While Investigating Accused Run Away From Police Station In Kadapa Districtkad - Sakshi

ఎస్‌ఐ విచారిస్తుండగానే నిందితుని తమవెంట లాక్కెళ్లిన బంధువులు 

స్టేషన్‌ రైటర్, కానిస్టేబుళ్లు వారిస్తున్నా ప్రయోజనం శూన్యం 

సంఘటనపై డీఎస్పీ విచారణ, ఏడుగురిపై కేసు నమోదు 

సాక్షి, కడప: కడప టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లోకి ఆదివారం నిందితుని బంధువులు జొరబడి, ఎస్‌ఐ విచారిస్తుండగానే అతన్ని లాక్కొని వెళ్లారు. వారిని వారించేందుకు వచ్చిన స్టేషన్‌రైటర్, కానిస్టేబుళ్లను సైతం పక్కకు తోసేశారు.విశ్వసనీయ వర్గాల సమాచారం, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హబీబుల్లా వీధికి చెందిన షేక్‌ షాబుద్దీన్‌ అనే వ్యక్తిపై అతనిభార్య సల్మాత్‌ సోదరులు గౌహర్‌ఆలీ, షేక్‌ ఖాలిద్‌  దాడి చేశారు.

ఈ సంఘటనపై జూన్‌ 2వ తేదీన కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్‌ చేసి తీసుకొచ్చేందుకు ఎస్‌ఐ మంజునాథ్‌ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం స్టేషన్‌ రైటర్, హెడ్‌ కానిస్టేబుల్‌ చాంద్‌బాషా ఆధ్వర్యంలో పోలీసు బృందం వెళ్లింది. నిందితుల్లో ఒకరైన గౌసర్‌ఆలీని స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్‌ఐ ముందు హాజరుపరిచారు. ఎస్‌ఐ అతన్ని విచారిస్తున్న సమయంలో నిందితుని బంధువులు షేక్‌ రేష్మా, గుల్జార్‌బేగం, సల్మా, జావేద్‌ఆలీ, ముబారక్, ఆయేషా  నేరుగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణకు చేరుకున్నారు. లోపలికి చొరబడి, తమ వెంట గౌసర్‌ఆలీని లాక్కొని వెళుతుండగా, రైటర్‌ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు రాఘవులు, పంచలింగాలు, రాజశేఖర్, చంద్రనారాయణ రెడ్డి  వారిని నివారించే ప్రయత్నం చేశారు. కానీ  దౌర్జన్యంగా తోసేసి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో రైటర్‌ చాంద్‌బాషా చేతి మధ్యవేలికి గాయమైంది. ఈ సంఘటన కడప నగరంలో దుమారం చెలరేగింది. సంఘటన స్థలానికి కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాషా చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్‌లో పట్టపగలు ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంపై పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలోనే చిన్న సంఘటన జరిగిందని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.    రైటర్‌ చాంద్‌బాషా ఫిర్యాదు మేరకు పై ఆరుగురితో పాటు, పై కేసులో నిందితుడైన గౌసర్‌ ఆలీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మంజునాథ్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top