విజి‘లెన్స్’ ఎక్కడ! | 'Where is the Vigilance | Sakshi
Sakshi News home page

విజి‘లెన్స్’ ఎక్కడ!

Jun 28 2015 2:46 AM | Updated on Sep 3 2017 4:28 AM

ఇసుక, మట్టి.. ఏడాది కాలంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు మొదలుకుని అధికార పార్టీ కార్యకర్తల వరకు అందరికీ అవే ప్రధాన ఆదాయ మార్గాలుగా మారాయి.

ఇసుక, మట్టి.. ఏడాది కాలంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు మొదలుకుని అధికార పార్టీ కార్యకర్తల వరకు అందరికీ అవే ప్రధాన ఆదాయ మార్గాలుగా మారాయి. జిల్లాలోని ముగ్గురు ప్రజాప్రతి నిధులైతే కేవలం ఇసుక, మట్టి విక్రయాల ద్వారానే ఈ ఏడాది కాలంలో రూ.కోట్లకు పడగలెత్తారంటే అతిశయోక్తి కాదు. ఎనిమిది నెలలుగా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టి అక్రమంగా తరలించిన నేతలు ఇప్పుడు ర్యాంపుల్లో గట్ల వెంబడి ఉన్న ఇసుక నిల్వలనూ వదలడం లేదు. వర్షాకాలం నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అధికారులు కొన్ని ర్యాంపుల వద్ద నిల్వ చేసిన ఇసుకను సైతం అక్రమార్కులు తరలించేస్తున్నారు.
 
 ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా పేట్రేగిపోతుందనేది బహిరంగ రహస్యం. పోలవరం, గూటాల, కొవ్వూరు ర్యాంపుల నుంచి జీలుగుమిల్లి మీదుగా ఇప్పటికీ భారీ ఎత్తున ఇసుక తెలంగాణ రాష్ట్రంలోకి  తరలిపోతోంది. నల్లజర్ల మండలం నబీపేట రేవులోని ఇసుకను స్థానిక సంస్థల ప్రతినిధి ఒకరు తన అనుచరులకు ఆదాయ మార్గంగా మలిచారు. పెదవేగి, నిడదవోలు, గోంగూర తిప్పలంక,  మందలపర్రు, పెండ్యాల, కానూరు ర్యాంపుల నుంచే కాదు.. చివరకు మెప్మా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఔరంగాబాద్ రేవు నుంచి కూడా ఇసుక భారీగా తరలిపోతోంది.
 
 మట్టి నుంచి నోట్ల కట్టలు పిండేశారు
 ఇక రైతులు తమ పొలాలను, పేదలు ఇళ్ల స్థలాలకు మెరక వేసుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన  నీరు-చెట్టు పథకాన్ని కూడా అధికార పార్టీ నేతలు అక్రమాల అడ్డాగా మార్చివేశారు. చెరువుల నుంచి తవ్విన మట్టిని రైస్‌మిల్లులు, పెట్రోలు బంకులు, టైల్స్ ఫ్యాక్టరీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి రూ.లక్షలు ఆర్జించారు. జిల్లావ్యాప్తంగా 97 లక్షల 50 వేల 262 క్యూబిక్ మీటర్ల మట్టిని చెరువుల్లోంచి తవ్వినట్టు రికార్డుల్లో నమోదైన్నప్పటికీ ఇందులో రైతులు తమ అవసరాలకు తోలుకుంది మాత్రం 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే. మిగిలిన 77లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తెలుగు తమ్ముళ్ల ఆదాయ వనరుగా మారిపోయింది. ఇదే మట్టిని ఆయా గ్రామ పంచాయతీల రోడ్లకు వినియోగించి బిల్లులు కూడా పెట్టుకున్నారంటే ఈ పథకంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించొచ్చు. గడువు ముగిసిన తర్వాత కూడా ఇప్పటికీ చెరువుల నుంచి మట్టి, గ్రావెల్‌ను తవ్వేస్తున్నారనేది స్వయంగా అధికారులు కూడా అంగీకరించే వాస్తవం.
 
 మరి నిఘా విభాగం ఏంచేస్తున్నట్టు?
 ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఉనికి ప్రశ్నార్థకంగా మారడం అనుమానాలకు తావిస్తోంది. ర్యాంపులపై దాడులు చేపట్టి అక్రమార్కులకు పెనాల్టీలు విధించి.. అవసరమైతే కేసులు గట్టిగా జూలు విదల్చాల్సిన విజిలెన్స్ విభాగం చేష్టలు చూస్తోందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇసుకాసురులు పేట్రేగిపోతున్నా విజిలెన్స్ అధికారులు తమకేం పట్టనట్టే వ్యవహరించారు. కేవలం కిరోసిన్ హాకర్లు, హోటళ్లపై దాడులు చేస్తూ చిన్న చేపలపై ప్రతాపం చూపిస్తున్న ఈ కీలక విభాగం అధికారులు ఇసుక, మట్టి మింగే పెద్దచేపల జోలికి వెళ్లే సాహసం మాత్రం ఇప్పటివరకు చేయలేకపోయారు. నిద్రపోయేవాళ్లను లేపగలం కానీ, నిద్ర నటించే వాళ్లను మాత్రం లేపలేమంటారు. మరి విజిలెన్స్ అధికారులు నిజంగానే నిద్రావస్థలో ఉన్నారా.. లేక నిద్ర నటిస్తున్నారా అనేది పాలకులకే ఎరుక.
 - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement