జిల్లాలో 2,050 ప్రాథమిక, 375 ప్రాథమికోన్నత, 643 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయుల గ్రాంటు, స్కూల్ గ్రాంటు, పాఠశాల నిర్వహణ, స్కూల్ కాంప్లెక్స్, జాతీయస్థాయి బాలికల విద్యా కార్యక్రమం(ఎన్‌పీజీఎల్)... వంటి మొత్తం 18 పద్దుల కింద పాఠశాలకు ఆర్వీఎం నిధులు ఇచ్చింది.
రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) అధికారుల ఉదాసీనత కారణంగా పాఠశాలల్లో ఖర్చు చేయని నిధులను వెనక్కి తెచ్చే ప్రక్రియ గాడి తప్పింది. పాఠశాలల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల కోసం కేటాయించిన నిధుల్లో ఖర్చు చేయని మొత్తాలను వెనక్కి తీసుకోవాలని ఈ ఏడాది మే 16న ఆర్వీఎం ప్రాజెక్టు రాష్ట్ర డెరైక్టర్ జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల యూనిఫాంకు సంబంధించిన నిధులు మినహా.. మిగతా ప్రతి పైసాను జిల్లా ప్రాజెక్టు అధికారి ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేశారు. అప్పటి లెక్కల ప్రకారం ఖర్చు చేయని నిధులు జిల్లాలో రూ.16.50 కోట్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికి రూ.5.50 కోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు తెలిసింది. మిగిలిన మొత్తం ఏ పాఠశాలల్లో ఏ పద్దులో ఉన్నాయో తెలియని పరిస్థితి. వీటిని ఖర్చు చేశారా... ఉంటే ఎక్కడున్నాయో అర్థంకాక అధికారులు అందోళనకు గురవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో 2,050 ప్రాథమిక, 375 ప్రాథమికోన్నత, 643 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయుల గ్రాంటు, స్కూల్ గ్రాంటు, పాఠశాల నిర్వహణ, స్కూల్ కాంప్లెక్స్, జాతీయస్థాయి బాలికల విద్యా కార్యక్రమం(ఎన్‌పీజీఎల్)... వంటి మొత్తం 18 పద్దుల కింద పాఠశాలకు ఆర్వీఎం నిధులు ఇచ్చింది. ఏ పద్దు కింద ఎంత నిధులిచ్చాం? ఎంత ఖర్చయ్యా యి? మిగులు నిధులెన్ని? అనే వాటిపై దృష్టి సారించలేదు. ఆర్వీఎం విడుదల చేసినా ఖర్చు చేయని నిధు లు రాష్ట్ర వ్యాప్తంగా రూ.663.24 కోట్లు ఉన్నాయి. మన జిల్లాలో ఇవి రూ.16.50 కోట్లు ఉన్నట్లు తేలింది.
ఖర్చు చేయని నిధుల్లో రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో జిల్లా అధికారుల ఉదాసీనతే ఇప్పుడు లెక్కల చిక్కులకు కారణంగా కనిపిస్తోంది. ప్రాజెక్టు రాష్ట్ర డెరైక్టర్ నుంచి వచ్చిన ఆదేశాలను వెంటనే అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించి నిధులను వెనక్కి తీసుకురావాల్సిన ఆర్వీఎం జిల్లా శాఖ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
మండల విద్యాధికారులతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు, డెప్యూటీ విద్యాధికారులతో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇస్తే సరిపోయేది. ఇలా చేయకుండా కొందరికి మౌఖికంగా, మరికొందరికి సూచనలు అన్నట్లుగా సమాచారం ఇచ్చారు. అందరు ప్రధానోపాధ్యాయుల నుంచి నిధులను రప్పించే బదులుగా కొం దరు సెక్టోరియల్ అధికారులు... లెక్కలను ఎలా మార్చాలో సూచనలు ఇచ్చారు. దీంతో కొందరు ప్రధానోపాధ్యాయులు నిధులు ఖర్చు చేసినట్లు పాత తేదీలతో నివేదికలు సిద్ధం చేశారు. ఇప్పుడు ఏ పద్దు కింద ఎంత మొత్తంలో నిధులు ఉన్నాయో లెక్కలు తేలడంలేదు. ఆర్‌వీఎం ప్రాజెక్టు డెరైక్టరు ఆదేశాలు ఏకరీతిన అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు చెబుతున్నారు.
అన్నింట్లో కోతలే...
2013-14 విద్యా సంవత్సరానికి నిధుల కేటాయింపు విషయంలో ఆర్వీఎం ఇప్పటికే మొండిచెయ్యి చూపింది. మన జిల్లాకు మంజూరయ్యే గ్రాంట్‌లో భారీగా కోత పెట్టింది. గతంలో ఏటా రూ.240 కోట్లు ఉండే నిధుల మంజూరు ఇప్పుడు రూ.100 కోట్లకు తగ్గిపోయింది. 2013-14 విద్యాసంవత్సరం నుంచి అదనపు తరగతి గదుల నిర్మాణానికి పూర్తిగా స్వస్తి పలికింది. ఈ ఏడాది ఇచ్చే టీచరు గ్రాంటును రద్దు చేసింది.
గతంలో ఒక టీచరురు రూ.500 చొప్పున... గరిష్టంగా రూ.2500 ఇచ్చేవారు. మండల వనరుల కేంద్రం గ్రాంటు రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించారు. పాఠశాల సముదాయం గ్రాంటు రూ.27 వేల నుంచి రూ.10 వేలు అయ్యింది. గ్రాంట్లు కుదించడం, మరోవైపు ఉన్న నిధులను వెనక్కి తెప్పించడం చూస్తుంటే... విద్యా శాఖపై ప్రభుత్వ శ్రద్ధ తగ్గిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.