రైతన్నకు స్వాతంత్య్రం ఎప్పుడు?
నేటి పాలకుల తీరుతో రైతులకు స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు...
	- వ్యాపారం కోసమే భూ సేకరణ
	- ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే
	మంగళగిరి: నేటి పాలకుల తీరుతో  రైతులకు స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరుతో ఇప్పటికే వేల ఎకరాల భూమిని సమీకరించిన ప్రభుత్వానికి ఇప్పడు మళ్లీ సేకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. గతంలో తాము చెప్పినట్లుగా  భూముల సేకరణ రాజధాని కోసం కాదని... వ్యాపారం కోసమేనన్న సంగతి రుజువైందన్నారు.  మంత్రి నారాయణ తాను ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేసి సమీకరణలో తీసుకునే ఎత్తుగడ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
	
	భూసమీకరణపై రైతులు కోర్టుకు వెళ్లగా కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని,  ఆ రైతుల నుంచి భూ సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని పెద్దలకు కోర్టు తీర్పులు అంటే గౌరవం లేదని, రైతుల మనోభావాలతో పని లేదన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇప్పటివరకు రాజధానిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడ భూములు ఇస్తారో చెప్పలేదని, రైతు కూలీలు, కౌలు రైతులు పనులు లేక పస్తులతో విలవిలలాడుతున్నారన్నారు.  రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా వుండి కడదాకా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
