
అంధకారంలో పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లాలో అంధకారం నెలకొంది. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు.
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో అంధకారం నెలకొంది. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలోని వారంతా ఉదయం ఆరు గంటల నుంచే నిరవధిక సమ్మె చేపట్టారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 1,777 మంది ఉద్యోగులు సమ్మెలో భాగస్వామ్యులయ్యారు. 220 కేవీ సబ్‌స్టేషన్‌ను ఉద్యోగులు ట్రిప్ చేశారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డి గూడెంతో సహా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటీపీఎస్, ఆర్‌టీపీఎస్, సీలేరు వంటి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోతోంది. ఈ ప్రభావం జిల్లాపై పడింది. నిన్న జిల్లా వ్యాప్తంగా ప్రాంతాన్నిబట్టి రెండునుంచి ఆరు గంటలపాటు అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ సరఫరాలో కోత విధించారు.
నేటి నుంచి జిల్లా ఉద్యోగుల సమ్మె వల్ల ఫీడర్లు ట్రిప్ అయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సమ్మె రెండు మూడు రోజులు కొనసాగితే జిల్లా అంతటా పూర్తిగా చీకట్లు అలుముకునే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగుల సమ్మె కారణంగా జిల్లాలోని వినియోగదారుల సౌకర్యార్థం కాంట్రాక్టు సిబ్బందితో ప్రతి డివిజన్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం ప్రజలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ టీవీ సూర్యప్రకాష్ సూచించారు.