టైమ్ బాబూ టైము.. | Welfare schemes Employment Appointments Development programs Minister relative | Sakshi
Sakshi News home page

టైమ్ బాబూ టైము..

Feb 6 2014 3:07 AM | Updated on Sep 2 2017 3:22 AM

పదేళ్ల పాటు జిల్లాలో ఆయన దందా అంతా ఇంతా కాదు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, ఉద్యోగ నియామకాలు చేయాలన్నా,

 పదేళ్ల పాటు జిల్లాలో ఆయన దందా అంతా ఇంతా కాదు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, ఉద్యోగ నియామకాలు చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా  ఆయన దృష్టికెళ్లాకే ఏదైనా చేయాల్సి వచ్చేది.  ఏ అధికారి అయినా కాదూ కూడదంటే ఇబ్బందులు పడడమో, బదిలీపై వెళ్లిపోవడమో జరిగేది. ఎంతటి అధికారైనా ఆయన కన్నుసన్నల్లో పనిచేయాల్సిందే. ఏ పనైనా తన మాట ప్రకారమే జరగాలంటూ హుకుం జారీ చేసేవారు. కొన్ని సందర్భాల్లోనైతే  ఎంతటి అధికారినైనా పరుష పదజాలంతో కసురుకునే వారు. ప్రతిదానికీ అధికారులు ఇంటికొచ్చి సలామ్ కొట్టే విధంగా పరిస్థితులు కల్పించారు.  ఈ పరిస్థితుల్లో మనసు చంపుకొని కొంతమంది పనిచేయగా, ఇంకొంతమంది ఆయన ప్రాపకం కోసం పనిచేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే అధికారులు మాకు టైమ్ వచ్చిందంటూ ఆయనకు ముఖం చాటేస్తున్నారు. 
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇన్నాళ్లూ జిల్లాలో చక్రం తిప్పిన రాజ్యాంగేతర శక్తి, మంత్రి బంధువు, షాడో నేతకు తిరోగమనం ప్రారంభమైందా? మంత్రి మేనల్లుడి గా చక్రం తిప్పిన  ఆయన జోరుకు బ్రేక్ పడిండా? సూపర్ పవర్‌తో జిల్లా రాజకీయాలను,అధికారులను శాసించిన  ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలా అంటే జిల్లాలోని ఏ ఒక్క అధికారీ ఇప్పుడు ఆయన చెప్పింది వినడం తప్ప కార్యాచరణలో పెట్టడం లేదు. ఆయనకు ఇప్పుడంత ‘సీన్’ లేదని తేలికగా తీసి పారేస్తున్నారు.
 
 మమ్మల్ని ఏమీ చేయలేరని, ఎన్నికల ఎఫెక్ట్‌తో ఐదారు నెలలు పాటు బయటికెళ్లిపోతు న్నామని, మళ్లీ వచ్చేలోగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదనే ధీమాకు వచ్చేశారు. ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుందన్నట్టుగా ఇప్పుడు జిల్లాలోని అధికారులకు అనుకూల పరిస్థితులొచ్చాయి. కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా తయారవడం, మంత్రి కి వ్యక్తిగతంగా తగ్గిన ప్రాబల్యంతో మళ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరికొన్ని రోజుల పాటు షాడో నేత అధికారం చెలాయించినా తమను ఏమీ చేయలేరని, సాధారణ ఎన్నికల ఎఫెక్ట్‌తో తామే  బదిలీపై వెళ్లిపోతామని, ఐదారు నెలలు పక్క జిల్లాల్లో ఉండి, మళ్లీ జిల్లాకు వచ్చేలోగా ఈ ప్రభుత్వం ఉండదన్న ధీమాకు ఎంపీడీఓలు, తహశీల్దార్లు వచ్చేశారు. 
 
 ఈ నేపథ్యంలో  ఆయన చెప్పిందల్లా విని గాలికొదిలేస్తున్నారు. మునుపటిలా రిస్క్ కాదు కదా తేలిక పాటి పనులు చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. జిల్లా అధికారులు కూడా ముఖం చాటేస్తున్నారు.పదవిలో ఉన్న వారు చెప్పేవే కాస్తోకూస్తో  చేస్తున్నారు. షాడో నేతకైతే చేయబోమన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. ఒకరకంగా ఆయనను పట్టించుకోవడమే మానేశారు. ఇన్నాళ్లూ సూప ర్ పవర్ చెలాయించిన ఆ నేతకు ప్రస్తుత పరిస్థితి మింగు డు పడడం లేదు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. చివరకు ఇన్నాళ్లూ పట్టించుకోని ఎమ్మెల్యేలపై ఆధారపడుతున్నారు. వారి ద్వారా పనులు చేయించుకునే పరిస్థితికి దిగజారారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement