రాత్రి చలితో.. పగలు ఎండతో

Weather Changes: Follow This Precautions In summer - Sakshi

పగలు భగభగ.. రాత్రి గజగజ

జిల్లాలో భయపెడుతున్న శీతోష్ణాలు

వివిధ రోగాలు వచ్చే అవకాశం

తెల్లదోమ ఉధృతికి అనువైన కాలం

సాక్షి, అమలాపురం : మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతోంది. శివరాత్రి దాటితే వేసవి ఎండలు వచ్చినట్టు భావిస్తారు. కానీ ఈసారి శివరాత్రి కన్నా ముందే వేసవి వచ్చినట్టుగా వాతావరణం కనిపిస్తోంది. గత 20 రోజుల్లో మధ్యలో మూడు నాలుగు రోజులు మినహా పగటి వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండ చురుక్కుమంటోంది. ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. ఇదే సమయంలో రాత్రి చలి తీవ్రత తగ్గడం లేదు. తెల్లవారు జామున మంచుదుప్పటి కప్పేస్తోంది. మరీ ముఖ్యంగా గడచిన రెండు రోజుల నుంచి జిల్లా మంచుముసుగులో చిక్కుకుంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రంపచోడవరం ఇలా అన్ని ప్రాంతాల్లోనూ మంచు కమ్ముకుంటోంది. ఉదయం పది దాటాక భానుడు చుర్రుమనిపించేస్తున్నాడు. 

జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కోనసీమ కేంద్రమైన అమలాపురం, జిల్లా కేంద్రమైన కాకినాడలో ఉష్ణోగ్రతల కన్నా విచిత్రంగా ఏజెన్సీలోని రంపచోడవరం, చింతూరుల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. పగటి పూట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే జిల్లాలో అత్యధికంగా ఏజెన్సీలోని చింతూరులో 35, ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరంతోపాటు మైదానంలో రాజమహేంద్రవరంలో 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చల్లని ప్రాంతమైన మారేడుమిల్లిలో 32 డిగ్రీలు నమోదు కాగా, అమలాపురం, కాకినాడల్లో 31 డిగ్రీలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలకు వస్తే జిల్లాలో అతి తక్కువగా మారేడుమిల్లిలో 16 డిగ్రీలు, రంప చోడవరంలో 18, చింతూరు, రాజమహేంద్రవరాల్లో 19, అమలాపురంలో 20, కాకినాడలో 24 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.  

పగలు, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య వాతావరణం తేడాగా ఉండడం వల్ల ప్రజలు పలు రోగాల బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరాలు, దగ్గు వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. ఇక కొబ్బరికి ప్రమాదంగా మారిన రూగోస్‌ వైట్‌ ఫ్లై (తెల్లదోమ) ఉధృతి పెరగడానికి ఇదే అనువైన కాలం.  

ఆరోగ్యం అప్రమత్తం సుమా.. 
వాతావరణ మార్పులతో వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ విజృంభిస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైరల్‌ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ఆయా అనారోగ్య లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.   

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి 
► మంచులో ఎక్కువగా తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వస్తే 
► మంచు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
 అతి శీతల నీరు తాగకూడదు. బాగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. 
► గొంతునొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించి  వైద్యం చేయించుకోవాలి. 
► డ్రైనేజీల సమీపంలో నివసించే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల బెడద లేకుండా జాగ్రత్త పడాలి.    

వైద్యులను సంప్రదించాలి 
ప్రస్తుత వాతావరణ మార్పులతో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మంచులో ఎక్కువగా తిరగకూడదు. దగ్గు, జ్వరం తదితర ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యసాయం పొందాలి.  
– డాక్టర్‌ చైతన్య, సూపరింటెండెంట్, మండపేట ప్రభుత్వ ఆస్పత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top