వక్ఫ్‌ భూమి హాంఫట్‌ | Wakf Land Occupied In Kurnool | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూమి హాంఫట్‌

Aug 10 2019 9:41 AM | Updated on Aug 10 2019 9:41 AM

Wakf Land Occupied In Kurnool - Sakshi

ప్లాట్లుగా మారిన వక్ఫ్‌ భూమి ఇదే.. 

సాక్షి, కోడుమూరు: కర్నూలు నగర శివారులో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వక్ఫ్‌ భూములను సైతం చెరబడుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారుల సహకారం కూడా ఉండడంతో రియల్టర్లు చెలరేగిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలోనే కల్లూరు మండలం పందిపాడు గ్రామ పరిధిలోని ఇండస్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న వక్ఫ్‌బోర్డు భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించారు. దీన్ని ప్లాట్లుగా మార్చి యథేచ్ఛగా అమ్ముతున్నారు.   

అడిగే వారేరీ? 
పందిపాడు గ్రామ సర్వే నంబర్లు 5, 7/ఏ, 22, 94లలో మొత్తం 21.58 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పలుకుతోంది. వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూములని తెలిసినా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో అధునాతన భవనాలు సైతం నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

అక్రమంగా రిజిస్ట్రేషన్లు 
ఈ ఏడాది జూలైలో కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ బదిలీపై వెళుతూ దాదాపు ఎకరన్నర వక్ఫ్‌ భూమిలోని ప్లాట్లకు అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించిన విషయం వెలుగు చూసింది. సర్వే నంబర్‌ 7/ఏలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇందుకు ప్రతిఫలంగా రియల్టర్ల నుంచి దాదాపు రూ.25 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. సర్వే నంబర్‌ 7/ఏలోని 12.12 ఎకరాల భూమి ఎంతోకాలంగా రిజిస్ట్రేషన్స్‌ నిషేధిత జాబితాలో ఉంది. అయినప్పటికీ బదిలీపై వెళ్తున్నానన్న ధీమాతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని ప్లాట్లను సర్వే నంబర్‌ మార్చి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోలేదు. కనీసం భూమి ఉన్న ప్రాంతంలో నోటీస్‌ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రోడ్లు వేసి, రాళ్లు పాతి ప్లాట్లను అమ్ముకుంటున్నారు. ఒక్క జూలైలోనే దాదాపు 30 ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement