ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు ప్రభుత్వ నజరానా కోసం ఎదురు చూస్తున్నాయి. గ్రామస్తులంతా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుంటే ఆయా పంచాయతీలకు గతంలో రూ. 5 లక్షలు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేవారు
సత్తెనపల్లి, న్యూస్‌లైన్: ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు ప్రభుత్వ నజరానా కోసం ఎదురు చూస్తున్నాయి. గ్రామస్తులంతా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుంటే ఆయా పంచాయతీలకు గతంలో రూ. 5 లక్షలు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేవారు. అయితే ప్రస్తుతం ఆ మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఏకగ్రీవ పంచాయతీలో 15వేలలోపు జనాభా ఉంటే రూ. 7 లక్షలు, 15వేలు పైబడి ఉంటే రూ. 20 లక్షలు అందివ్వనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
సత్తెనపల్లి నియోజకవర్గంలో
సత్తెనపల్లి మండలంలో కట్టావారిపాలెం, ఫణిదం, భృగుబండ్ల, గుజ్జర్లపూడి. ముప్పాళ్ల మండలంలో తురకపాలెం, నార్నెపాడు, రుద్రవరం, లంకెలకూరపాడు. రాజుపాలెం మండలంలో ఇనిమెట్ల, మొక్కపాడు, అంచులవారిపాలెం, బ్రాహ్మణపల్లి. నకరికల్లు మండలంలో దేచవరం, చల్లగుండ్ల, తురకపాలెం, నర్సింగపాడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇంత వరకు వీటికి నజరానాలు అందలేదు. పంచాయతీల అభివృద్ధికి త్వరగా ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. దీనిపై వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే...
నిధుల విడుదలలో జాప్యం వద్దు
ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు సకాలంలో ఇవ్వగలిగితే వచ్చే ఎన్నికల్లో ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతోంది. ప్రజలకు నమ్మకం ఉంటుంది. సకాలంలో ఇస్తేనే సమస్యలు కొంతైనా తీరతాయి. అధికారులు ఆ దిశగా చొరవ చూపాలి.
- చెవల ఓబులేశ్వరరావు, సర్పంచ్, కట్టావారిపాలెం
సకాలంలో ఇస్తే మేలు
పంచాయతీలకు రెండు సంవత్సరాలుగా నిధులు లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఏం చేద్దామన్నా నిధుల లేమితో అల్లాడుతున్నాం. నజరానాలు సకాలంలో అందిస్తే సమస్యలు తీరతాయి.
- మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్, నర్సింగపాడు
అధికారులు స్పందించాలి
పంచాయతీల్లో డ్రెయినేజీ, రహదారుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించే నిధులు గతంలో మాదిరిగా కాకుండా ముందుగా ఇస్తే సమస్యలు తీరతాయి. అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి.
- బండారు వెంకటేశ్వర్లు, సర్పంచ్, దేచవరం
ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది
నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్న ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. వీధి దీపాలు, సిమెంటు రోడ్లు, ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు సత్వరమే అందివ్వగలిగితే అభివృద్ధి వేగవంతం అవుతోంది.
- బొక్కా. చినగురువు, సర్పంచ్, చల్లగుండ్ల