అత్తారింటికి దారేదీ...? | Vizianagaram town, curfew enforcement than ever with the DASARA | Sakshi
Sakshi News home page

అత్తారింటికి దారేదీ...?

Oct 14 2013 4:00 AM | Updated on Sep 1 2017 11:38 PM

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నడూ లేనివిధంగా విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ అమలు చేయడంతో దసరా సందడి తగ్గింది. కొత్త అల్లుళ్లు, కొత్త కోడళ్లు సైతం రాజాలాగా అత్తారింటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నడూ లేనివిధంగా విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ అమలు చేయడంతో దసరా సందడి తగ్గింది. కొత్త అల్లుళ్లు, కొత్త కోడళ్లు సైతం రాజాలాగా అత్తారింటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పండగ షాపింగ్ చేద్దామంటే దుకాణాలు సైతం పూర్తిగా తెరవకపోవడంతో ఇళ్లల్లో పండగ కళ కన్పించడం లేదు. దసరా, పైడితల్లమ్మ పండగల సందర్భంగా విజయనగరం జిల్లా వాసులు పెద్ద ఎత్తున కొత్త దుస్తులు, ఇతరత్రా గృహోపకరణాలు, వాహనాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే ఈ సారి దసరా ముందురోజు వరకూ దుకాణాలు తెరవకపోవడంతో వస్తువాహనాలు కొనుక్కోలేక జనం అవస్థలు పడ్డారు. 
 
 మామూలు జనానికి ఇదేమీ పెద్ద అవస్థ కాకున్నా కొత్త అల్లుళ్లు, కొత్త కోడళ్లకు ఇది ఇబ్బందికర సమయం. గత వేసవిలోను, శ్రావణమాసంలోను పెళ్లిళ్లు చేసుకున్న విజయనగరానికి చెందిన నవ దంపతులకు ఇది చికాకును కలిగిస్తోంది.  కొత్తల్లుడ్ని ఇంటికి పిలిచి నవకాయ పిండివంటల తో భోజనం పెడదామని అత్తగారికి ఆశగా ఉన్నా మనసారా పిలవలేని పరిస్థితి. ‘మొన్నటి గొడవల కారణంగా ఈ మద్దిన పోలీసోళ్లు ఊరంతా గాలించి అనుమానం కలిగితే చాలు పట్టుకెళ్లిపోతున్నారు. ఈ సందట్లో సడేమియాలాగ  కొత్తల్లుడ్ని గానీ తీస్కెళ్లిపోతే అత్తగారింటి పరువు పెద్ద సెరువులో కలిసినట్టే. పండక్కని అల్లుడ్ని పిలిచి పోలీసోళ్లకి అప్పగించెత్తా రా?? అంటూ ఇయ్యపోరు తిట్టిపోసెత్తారు. 
 
 అలాగని పిలవకుండా ఉంటే పరువు పోయినట్లే...ఛస్ ...ఊరికి దరిద్రం పట్టీసినట్లుంది...ఎప్పుడూ లేంది...మా అల్లుడు కోసమే ఈ గోలంతా దాపురించినట్లయింది....’ అనుకుంటూ ఓ అత్తమ్మ ఆవేదన చెందుతోంది. బుగ్గల నిండా సిగ్గులు నింపుకున్న అర్థాంగిని కొత్తగా కొన్న బైక్ ఎక్కించుకుని గంటస్తంభం, కోట ఇవన్నీ చూసేసి హాయిగా షికార్లు కొట్టి సెకండ్ షోకి వెళ్దామనుకుంటే ఊళ్లో సినిమాహాళ్లే బంద్ సేసీనారు. అత్తారింటికి వచ్చినా గిట్టుబాటు కాలేదు...మరేటి సేత్తాం...ఇంట్లో కూకొని జీడిపాకం సీరియళ్లు సూడ్డమే గతిలాగుంది...నాకు పెళ్లయిన సంవత్సరమే ఇలా జరగాలా....’ అని ఓ కొత్త పెళ్లికొడుకు కుమిలిపోతున్నాడు. ‘పెళ్లప్పుడు వచ్చిన అక్క మొగుడు నాతో పరాచికాలాడతాడా? నా జడలు పట్టుకుని లాగుతాడా?? ఈసారి దసరాకు రానీ చెప్తాను...కాఫీ పేరు చెప్పి కారం నీళ్లు తాగించేయనూ...’ అని ఎదురు చూసిన ఓ మరదలి ఆశ కూడా ఈ కర్ఫ్యూ కారణంగా నెరవేరడం లేదు. 
 
 ‘బాసూ...మా పెళ్లి హడావుడిగా జరిగిపోవడంతో అప్పట్లో మా మామగారు నాకు బైక్ ఇవ్వలేకపోయారు. దసరాకు ఇస్తామన్నారు... కానీ ఇప్పుడు ఇజానారంలో పరిస్థితి ఏం బాలేదు. వ్యాపారం లేక మామామే దివాలా తీసేశాడు. ఇంకా నాకు బైకేం కొంటాడు...ఏదైనా నా జాతకం బాలేనట్లుంది బాసూ....’ ఇది ఓ కొత్త అల్లుడి నిర్వేదం... ఇలా వివిధ వర్గాల ప్రజల ఆశలపై కర్ఫ్యూ నీళ్లు చల్లేసింది. సినిమాహాళ్లలో సందడి లేదు. నవ దంపతుల కువకువలు లేవు. బావామ రదళ్ల సరసా లు లేవు. పట్టణమంతా గంభీర వాతావరణమే కనిపించడంతో జనం నిరుత్సాహంగానే పండగ తంతు పూర్తి చేసేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement