మరో ఛాన్స్‌!

Vizianagaram District Is Getting Ready For The National Award For The Third Time - Sakshi

మరో జాతీయ అవార్డుకు చేరువగా విజయనగరం 

ఉపాధి హామీ అమలు తీరుపై పరిశీలనకు అర్హత 

జాతీయ స్థాయిలో పోటీపడుతున్న జిల్లాలు 13 

ప్రారంభమైన కేంద్ర బృందం పరిశీలన

ఇప్పటికే రెండు పర్యాయాలు జిల్లాకు దక్కిన అవార్డు 

విజయనగరం: జిల్లాను మరో జాతీయ అవార్డు ఊరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం అమలులో ఇప్పటికే రెండుసార్లు జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్న విజయనగరం జిల్లా మూడో సారి  అవార్డు  చేజిక్కించుకునేందుకు సమాయత్తమవుతోంది. కేంద్రం నిర్దేశించిన పలు ప్రామాణికాల్లో జిల్లా మెరుగైన ప్రతిభ కనబరచటంతో 2018–19 సంవత్సరానికి సంబంధించి ప్రదానం చేయనున్న అవార్డుకు జిల్లా పోటీ పడుతోంది. ఇప్పటికే 2011–12 ఆర్థిక సంవత్సరంలో ఒకసారి,  2015–16 ఆర్థిక సంవత్సరంలో రెండో సారి జాతీయ అవార్డులు దక్కించుకుని తాజాగా 2018–19 సంవత్సరానికి పోటీపడుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం జిల్లాలో ఆదివారం నుంచి క్షేత్ర స్థాయి పర్యటన చేస్తుండగా... మొత్తంగా మూడున్నర రోజులు ఈ పరిశీలన నిర్వహించనుంది.

పోటీలో ఉత్తరాంధ్ర జిల్లాలు.. 
గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో జాతీయ అవార్డు రేసులో ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విశాఖ జిల్లాలతో పాటు విజయనగరానికి మరోసారి స్థానం దక్కింది. ఈ మేరకు కేంద్ర కమిటీ ఆదివారం నుంచి చేపట్టదలచిన మూడున్నర రోజుల క్షేత్ర స్థాయి పర్యటన ఆదివారం ప్రారంభమైంది. జాతీయ అవార్డుకు దేశంలో 13 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయగా, మన రాష్ట్రం నుంచే ఆరు జిల్లాలు నామినేషన్‌కు వెళ్లాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు, పీడీలు ఇప్పటికే జిల్లాల ప్రగతిని ఢిల్లీకి వెళ్లి వివరించగా, అందులో రాష్ట్రానికి చెందిన ఉత్తరాంధ్ర జిల్లాలే ఎంపిక కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కేంద్ర బందం పర్యటిస్తోంది. జిల్లాకు 2010–11 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కింది. అప్పటి నుంచి ఏటా అవార్డుకు జిల్లా నామినేట్‌ అవుతూనే ఉంది. 2015–16లో రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ఈ సారి దేశంలోనే ఉపాధిహామీ అమలులో ఉత్తమ ప్రగతిని కనబరిచిన ఒకే ఒక్క జిల్లాను ఉత్తమ జాతీయ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని 13 జిల్లాలను నామినేట్‌ చేయగా, అందులో మన రాష్ట్రానికి చెందిన విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాలు అవార్డు కమిటీ ముందు ప్రెజెంటేష¯న్‌ ఇచ్చాయి. అందులో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు మాత్రమే ఎంపికయ్యాయి.

అన్ని రంగాల్లో ముందంజ.. 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో ఏటా వందల కోట్ల నిధులు వెచ్చించి పనులు చేపట్టడంతో పాటు పని లేని వారికి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి పథకం అమలులో అన్ని రంగాల్లోనూ జిల్లా  ప్రగతి కనిపిస్తోంది. 100 రోజుల పనికల్పనలో దేశంలోనే విజయనగరం జిల్లా నాలుగో స్థానంలో నిలవగా, మన రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. 1.16లక్షల కుటుంబాలకు 100 రోజులు పని కల్పించారు. అత్యధికంగా జిల్లాలో రూ.507.45 కోట్లు ఉపాధి వేతనాలు చెల్లించి రాష్ట్రంలోనే విజయనగరం ద్వితీయ స్థానంలో నిలిచింది. 2.61 కోట్ల పనిదినాలతో రెండో స్థానం కాగా, సరాసరి 70.26 శాతం పని దినాలు కల్పించిన జిల్లాల్లో రాష్ట్రంలోనే మూడోది. 3.50 లక్షల మంది మహిళలు ఉపాధి పనులకు హాజరు కావడం మరో రికార్డుగా చెప్పవచ్చు.  ఇలా అన్ని ప్రామాణికాల్లో జిల్లా ప్రతిభ కనబరిచింది. 

ప్రారంభమైన పరిశీలన 
జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం తమ తొలిరోజు పర్యటన ఆదివారం పూర్తి చేసింది. మూడున్నర రోజులు ఈ బృందం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.  పరిశీలించిన అంశాలతో కేంద్రానికి నివేదిక అందజేస్తుంది. బృంద సభ్యులు ఇచ్చిన నివేదిక మేరకు ఒక్క జిల్లాకు మాత్రమే అవార్డు ప్రదానం చేస్తారు. జిల్లాలో ఈ బృందం 20 గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉంది.  
–ఎ.నాగేశ్వరరావు, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, డ్వామా   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top