కాకినాడ రూరల్‌కు జ్వరమొచ్చింది | Sakshi
Sakshi News home page

కాకినాడ రూరల్‌కు జ్వరమొచ్చింది

Published Sat, Nov 22 2014 2:14 AM

Viral fever cases surge in East Godavari district

కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ మండలానికి జ్వరమొచ్చింది. మండలంలోని తిమ్మాపురం, ఇంద్రపాలెం, స్వామినగర్, తూరంగి, కొవ్వూరు, రమణయ్యపేట, వాకలపూడి, సూర్యారావుపేట, వలసపాకల గ్రామాల్లో జ్వరపీడితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. రెండు రోజుల కిందట ఇంద్రపాలెంలో 12 ఏళ్ల బాలుడికి జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోయింది. అతడికి డెంగీ పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో జ్వరాల తీవ్రతను గుర్తించేందుకు వైద్యాధికారులు అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్నారు.

వారం రోజుల క్రితం బినిపే కామేష్ అనే వ్యక్తి గల్ఫ్ నుంచి తిమ్మాపురం వచ్చాడు. వచ్చినప్పటి నుంచీ జ్వరంతో బాధ పడుతున్నాడు. పండూరు పీహెచ్‌సీ వైద్యురాలు జి.లక్ష్మి ట్రీట్‌మెంట్ ఇచ్చినా జ్వరం తగ్గకపోగా, చుట్టుపక్కల ఉన్న మరో ఏడుగురు కూ డా జ్వరాలబారిన పడ్డారు. దీంతో తిమ్మాపురంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సలాది మహేష్, సలాది పాప అనే ఇద్దరు జ్వరం, విరేచనాలతో బాధపడుతూండడంతో అధికారులు ఆగమేఘాల ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. గత ఏడాది తూరంగి డ్రైవర్స్ కాలనీలో ఇద్దరు పిల్లలు డెంగీతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా డెంగీ విజృంభిస్తుందేమోనని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
అధ్వానంగా పారిశుద్ధ్యం
పారిశుద్ధ్య లోపమే జ్వరాల తీవ్రతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నగరం, గ్రామం అన్న తేడా లేకుండా అంతటా పారిశుద్ధ్యం అధ్వానంగానే ఉంది. గ్రామాల్లో మురుగు కాలువల నిర్మాణం సరిగా లేకపోవడం, పూడికలు తీయకపోవడంతో కొన్నిచోట్ల రోడ్లపైనే మురుగు మడుగు కడుతుంది. ఈ ప్రాంతాలు దోమలకు కేంద్రాలుగా మారుతున్నాయి.

గ్రామాల్లో ఇళ్ల మధ్యనే పెంటకుప్పలు ఉంటున్నాయి. ఇక్కడ పందులు, కుక్కలు చేరడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. కొన్ని కాలనీలు, గ్రామాల్లో సిమెంటు రోడ్లు నిర్మించినా కాలువలను విస్మరించడంతో ఇళ్లలో వాడుక నీరు, మురుగు నీరు ఎక్కడికక్కడే నిలచిపోతోంది. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా వాటిని అధికారులు ఖర్చు చేయడం లేదు. ఫలితంగా పారిశుధ్యం నానాటికీ దిగజారుతోంది.
 
ఈ లక్షణాలుంటే..
* విపరీతంగా చలి, చెమట, తలపట్టడం, వాంతులతో కూడిన జ్వరం వస్తే మలేరియాగా అనుమానించాలి. సమీప ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు చేయించుకోవాలి.
* జలుబు, దగ్గుతోపాటు జ్వరం వస్తే వైరల్ జ్వరంగా అనుమానించాలి. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తి నోటికి, ముక్కుకు రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. లేకుంటే వైరస్ మరో వ్యక్తికి వ్యాపిస్తుంది.
* ఒక్కసారిగా 100 నుంచి 102 డిగ్రీల జ్వరం వచ్చి మళ్లీ తగ్గుతూ ఉంటుంది. ఇలా రోజుకు నాలుగైదుసార్లు ఉంటుంది. వారంపాటు ఇలాగే ఉంటే టైఫాయిడ్‌గా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. కలుషిత నీరు, ఫంగస్ వల్ల ఈ జ్వరం వస్తుంది.
* 103 నుంచి 104 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చి కొద్ది రోజుల తరువాత మళ్లీ తిరగపెడితే చికున్‌గన్యా జ్వరంగా భావించాలి. ఒకసారి ఈ జ్వరం వస్తే నీర్సం, నొప్పుల నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కీళ్ల నొప్పులతో కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్లు, చేతులు వాచుతాయి. దోమ కాటు ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుంది.
* హఠాత్తుగా జ్వరం, కళ్లు కదిలించలేని పరిస్థితి, ఎముకలు, కండరాల్లో విపరీతమైన నొప్పి వస్తే డెంగీగా అనుమానించాలి. జ్వరం వచ్చిన రెం డో రోజు నుంచి వెన్నెముక నొప్పి, కనుబొమ్మ ల వాపు, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం రోజుల పాటు ఇలానే ఉంటే రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గుతుంది. ఒకసారి వచ్చిన జ్వరం 10 రోజుల తరువాత మళ్లీ తిరగబెడుతుంది. వాంతులు, వికారం, రక్తంతో కూ డిన మలవిసర్జన వ్యాధి తీవ్రమైందనడానికి గు ర్తులు. ఇది దోమ ద్వారానే వ్యాప్తి చెందుతుం ది. పూర్తిగా వైద్యుని పర్యవేక్షణలోనే ఉండాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement