యాదవ్‌ జీ.. ఆలకించరూ! | Vinod Kumar yadav Tour To Kurnool Today | Sakshi
Sakshi News home page

యాదవ్‌ జీ.. ఆలకించరూ!

Dec 20 2018 12:34 PM | Updated on Dec 20 2018 12:34 PM

Vinod Kumar yadav Tour To Kurnool Today - Sakshi

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ గురువారం కర్నూలుకు రానున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన ఉదయం 9–30గంటలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌ చేసుకుంటారు. స్టేషన్, స్టాల్స్, అభివృద్ధి పనులు, క్వార్టర్స్, అతిథి గృహాలను పరిశీలించి జిల్లాలో పెండింగ్‌ పనుల వివరాలపై ఆరాతీయనున్నారు.  

కర్నూలు (రాజ్‌విహార్‌): రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాకు ప్రతిసారీ అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రతి బడ్జెట్‌లో ఇదే తీరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆదే నిరాశ. రైల్వే ప్రాజెక్టుల పురోగతికి పట్టిన గ్రహణం వీడటం లేదు. జిల్లాలో ఓ డివిజన్‌ లేదు. రైళ్ల రాకపోకలకు డబుల్‌ ట్రాక్‌ లేదు. కర్నూలు మీదుగా గరీబ్‌రథ్‌లు లేవు. పలు సూపర్‌ ఫాస్టులకు స్టాపింగ్‌లు లేవు. ప్రయాణికులకు మెరుగైన సేవలు పక్కనపెడితే కనీస సౌకర్యాలు లేవు. కర్నూలును ఒక డివిజన్‌లో, డోన్‌ను మరో డివిజన్‌లో కలిపి పురోగతికి రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

డిమాండ్లు.. అవసరమయ్యే నిధులు..
కర్నూలు– మంత్రాలయం లైన్‌..
మంత్రాలయం – కర్నూలు మధ్య కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ 48ఏళ్ల నుంచి ప్రతిపాదనలో ఉంది. ఈ లైన్‌కు రెండు సార్లు సర్వే చేశారు. 2004లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించి సర్వే చేశారు. 2011 డిసెంబర్‌లో రీ సర్వే చేసి నివేదికలిచ్చారు. 2015–16 బడ్జెట్‌లో మళ్లీ రీ సర్వే చేయాలని రూ.13.65లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. 110కిలో మీటర్ల పొడవైన ఈ మార్గానికి రూ.1100కోట్లు అవసరమని అంచనా. ప్రజల విన్నపం మేరకు 2018–19 బడ్జెట్‌లో ట్రాఫిక్‌ సర్వే కోసం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ కేంద్రం ప్రకటించినా చర్యలు శూన్యం.

రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌..
కర్నూలులో రైల్వే మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటుకు 2013 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. స్థలం సేకరించినా పురోగతి లేదు. గత బడ్జెట్‌ తరువాత ప్రభుత్వం రూ.10 కోట్లు ప్రకటించింది. అయితే రూ. 2కోట్లు కూడా విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తికి రూ. రూ.250కోట్లు అవసరం. అరకొరగా నిధులతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

అడ్రస్‌ లేని మెయింటెనెన్స్‌ షెడ్‌..
నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు 2013లో తెరపైకి వచ్చిన ట్రైన్‌ మెయింటెనెన్స్‌ (నిర్వాహణ) షెడ్‌ నామరూపాలు లేకుండా పోయింది. దూపాడు వద్ద ఏర్పాటు చేస్తామని రైల్వే సహాయ మాజీ మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2కోట్లు కావాల్సి ఉంది. వర్క్‌షాప్‌ పూర్తయితే దాదాపు 5వేల మందికి ప్రత్యేక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రాజధానికి రైలేదీ?
రాష్ట్ర రాజధాని అమరావతికి కర్నూలు నుంచి నేరుగా వెళ్లేందుకు రోజువారి రైలు లేదు. కాకినాడకు  స్పెషల్‌ రైలు బుధ, శుక్రవారాల్లో మాత్రమే నడుస్తోంది. మిగిలిన రోజుల్లో డోన్, నంద్యాలకు వెళ్లి రైలెక్కాలి. గుంటూరు వరకు కేవలం రెండు ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే ఉన్నాయి. కర్నూలు నుంచి రెండు ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్‌ సిటీ, మరో రెండు ప్యాసింజరు రైళ్లను నడపాల్సిన అవసరం ఉంది.

వినియోగానికి నోచుకోని మల్టీప్లెక్స్‌..  
కర్నూలు స్టేషన్‌ ఆధునీకరణ, మల్టీప్లెక్స్‌ భవన నిర్మాణానికి గత బడ్జెట్‌లో రూ.25కోట్లు మంజూరు చేశారు. అయితే మల్టీప్లెక్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించినా వినియోగంలోకి రాలేదు. ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.2కోట్లకు పైగా అవసరం.
డోన్‌ నుంచి కర్నూలు మీదుగా సికింద్రాబాద్‌ వరకు 260కి.మీ. దూరం డబుల్‌ లైన్, విద్యుదీకరణకు సర్వే చేసినా పెండింగ్‌లో ఉంది. పనులు త్వరగా పూర్తయితే ఈ రూట్‌లో మరిన్ని రైళ్లు నడపొచ్చు.  
హోస్పేట్‌–మంత్రాలయం–కర్నూలు –నంద్యా ల– శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు మార్గం నిర్మించాలి.
డోన్‌ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూర్‌ మీదుగా ముంబైకి రైలు నడుపుతామని మాజీ సహాయ మంత్రి కోట్ల ఇచ్చిన హామీ నెరవేరలేదు.
సికింద్రాబాద్‌ నుంచి కర్నూలు మీదుగా బెంగ ళూరు వరకు గరీబ్‌రథ్‌ ఏర్పాటు చేయాలి.
విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు, హైదరాబాద్‌ మీదుగా రాజ్‌కోట్‌ వరకు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నడపాలి.
ఔరంగాబాద్, ఆదోని మీదుగా నుంచి రేణిగుంట, యశ్వంత్‌పూర్‌ నుంచి ఆదోని మీదుగా కాటా (ఉత్తరప్రదేశ్‌) వరకు నడుపుతామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.
కర్నూలు – నంద్యాల మధ్య వారంలో ఆరు రోజులు నడుస్తున్న డెమో ప్యాసింజర్‌ రైలును రోజూ నడపడంతో పాటు ఇందులో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. డోన్, బేతంచెర్ల మీదుగా కాకుండా కర్నూలు – నంద్యాల మధ్య కొత్త లైన్‌ ఏర్పాటు చేయాలి.

ముస్తాబవుతున్న స్టేషన్‌  
వినోద్‌కుమార్‌ యాదవ్‌ వస్తుండటంతో సిటీ స్టేషన్‌ను ముస్తాబు చేస్తున్నారు. స్టేషన్‌తోపాటు ప్లాట్‌ఫాంలు, ఆసుపత్రి, గెస్ట్‌ హౌస్, రిజర్వేషన్‌ కౌంటర్‌ తదితర చోట్ల రంగులు వేస్తున్నారు. ట్రాక్, ప్లాట్‌ఫామ్‌లను వాటర్‌ ఆప్రాన్‌ ద్వారా క్లీనింగ్‌ చేస్తున్నారు. ఇతర ఏర్పాట్లతో అన్ని విభాగాల అధికారులు బిజీబిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement