బిగుసుకుంటున్న ఉద్యమ పిడికిళ్లు | Villagers Are up Against Godavari Mega Aqua Food Park | Sakshi
Sakshi News home page

బిగుసుకుంటున్న ఉద్యమ పిడికిళ్లు

Oct 6 2017 11:01 AM | Updated on Mar 28 2019 6:26 PM

 Villagers Are up Against Godavari Mega Aqua Food Park  - Sakshi

భీమవరం అర్బన్‌: భీమవరం మండలంలోని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలబేతపూడి గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమ పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. ఇటీవల పది రోజులకు పైగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాని ప్రభుత్వం, ఫ్యాక్టరీ యజమానుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సెప్టెంబర్‌ 20న ఫుడ్‌పార్కు బాధిత గ్రామాలైన తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల ప్రజలు, పోరాట కమిటీ నాయకులు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొంతమంది పోరాట కమిటీ నాయకులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డగించి బయటకు పంపివేశారు.

ఎక్కడిక్కడ రహస్య మంతనాలు
మూడేళ్లుగా ఫుడ్‌పార్కు వద్దని ఫుడ్‌పార్కు పోరాట కమిటీ నాయకులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం, యాజమాన్యం మొండిగా ముందుకెళ్తున్నాయి. అంతేకాకుండా ఎదురు తిరిగిన వారిపై వివిధ సెక్షన్లతో కేసులు పెట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించారు. వందలాది మంది గ్రామస్తులు పోలీసుల చేతిలో దెబ్బలు తిని, అరెస్టు అయ్యి బయటకు వచ్చారు. ముందుగానే సమాచారం ఇస్తే భారీగా పోలీసులను మోహరిస్తున్నారని తెలుసుకుని ఫుడ్‌పార్కు బాధిత గ్రామాల్లో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

పోలీసు బలగాల రక్షణతో..
విషం చల్లే గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు వద్దని మూడేళ్ల నుంచి ప్రజలు పోరాటం చేస్తున్నారు. అయితే 144 సెక్షన్‌ విధించి వందలాది మంది పోలీసుల పహారాలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు.

ఫ్యాక్టరీ వల్ల నష్టాలు
ఇక్కడ నిర్మించే గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కులో రోజుకు మూడు వేల టన్నుల చేపలు, రొయ్యలు శుభ్రపరుస్తారు. వీటిని శుభ్రపరిచేందుకు వందలాది టన్నుల అమ్మోనియా, నైట్రేట్, ఉప్పును వాడతారు. ఆ నీటిని పక్కనే ఉన్న గొంతేరు డ్రెయిన్‌లోకి విడుదల చేయడంతో మూడు పంటలు పండే భూములు ఉప్పుకయ్యలుగా మారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మత్స్య సంపద దెబ్బతింటుందని 40 వేల మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని చెబుతున్నారు. ఆరు మండలాల ప్రజలపై ఈ ఫ్యాక్టరీ ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement