కల్తీపై విజిలెన్స్‌ కొరడా

Vigilance Attack on Adulterated Food in Prakasam - Sakshi

కేకుల్లో మితిమీరిన రంగు వినియోగిస్తున్నట్లు గుర్తింపు

బేకరీల్లో గడువు మీరిన కూల్‌డ్రింక్‌ బాటిళ్లు

పలు శాంపిళ్ల సీజ్‌

ఒంగోలు: విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆహార పదార్థాల తనిఖీ విభాగం, తూనికలు కొలతల శాఖ అధికారులు నగరంలో గురువారం సంయుక్తంగా పలు బేకరీలు, షాపులపై కొరడా ఝులిపించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పదార్థాల తయారీలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సామూహికంగా దాడులు నిర్వహించారు. నగరంలోని కావేరి గ్రాండ్‌ హోటల్‌లో చికెన్‌ కర్రీ, చికెన్‌ బిర్యానీ శాంపిల్స్‌ సేకరించారు. స్థానిక పాత మార్కెట్‌ సెంటర్లోని హిందూస్థాన్‌ హోటల్‌లో మటన్‌ కర్రీ శాంపిల్‌ తీశారు. స్థానిక పద్మాలయ బేకరీలో రంగురంగుల కేకులు, పలు రకాల వస్తువులను గుర్తించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సీఐ బీటీ నాయక్‌ మాట్లాడుతూ అదనపు ఎస్పీ రజని, డీఎస్పీ అంకమ్మరావుల ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తనిఖీ విభాగం అధికారులతో కలిపి సంయుక్తంగా రెండు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు చెప్పారు. మటన్, చికెన్‌లకు సంబంధించి నిల్వ ఉన్న పదార్థాలా కాదా అనేది ల్యాబ్‌కు పంపి నిర్థారణ చేస్తామని వివరించారు.

పద్మాలయ బేకరీలో కేకులు, దిల్‌పసంద్‌లు శాంపిల్స్‌ తీసుకున్నామన్నారు. కేకులపై చాక్‌లెట్‌ కలర్‌ క్రీమ్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించామని, తాము సీజ్‌ చేసిన ఆరు డబ్బాలు పది నెలల గడువు మీరాయన్నారు. మరో వైపు బ్రెడ్లకు సంబంధించి ప్యాకింగ్‌ నిబంధనలు పాటించడం లేదని, ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్‌ నంబర్‌ కూడా ప్యాకింగ్‌లపై ఉండటం లేదన్నారు. పలు కూల్‌డ్రింకు బాటిళ్లు కూడా గడువు మీరి ఉన్నాయన్నారు. ప్రధానంగా అధిక మోతాదులో రంగు కలిగిన పదార్థాలు తింటే క్యాన్సర్‌ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని, వ్యాపారులు మాత్రం నిల్వ ఉన్న పదార్థాలు విక్రయించడంతో పాటు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అధిక రంగులు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తాము గుర్తించిన ఆహార పదార్థాల శాంపిల్స్‌ తనిఖీ విభాగం జిల్లా అధికారి వీర్రాజు నేతృత్వంలో సీజ్‌ చేసి ల్యాబ్‌కు పంపుతామని, ల్యాబ్‌ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనిఖీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సీఐ బీటీ నాయక్, టీఎక్స్‌ అజయ్‌కుమార్, ఎస్‌ఐ వెంకట్రావు, హెడ్‌కానిస్టేబుల్‌ కోటేశ్వరరావు, కానిస్టేబుల్‌ శివకుమార్, నరసయ్య, తహసీల్దార్‌ శామ్యూల్‌పాల్, తూనికలు, కొలతల శాఖ అధికారి అనీల్, ఆహారపదార్థాల తనిఖీ అధికారి వీర్రాజు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top