భూ మాయకు అడ్డుకట్ట!

Verify Webland records by survey numbers - Sakshi

సర్వే నంబర్ల వారీగా వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తనిఖీ

ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రామాణికంగా లావాదేవీల పరిశీలన

రికార్డుల స్వచ్ఛీకరణకు మార్గదర్శకాలు సిద్ధం

కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తికి ఐదు ఎకరాలుండగా రాత్రికి రాత్రే అతడి పేరుతో 30 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించారు. సదరు భూమిపై బ్యాంకులో రుణం తీసుకున్న రెండు రోజులకే ఆ భూమిని వెబ్‌ ల్యాండ్‌లో ఆయన పేరుతో లేకుండా ప్రభుత్వ ఖాతాలోకి మార్చేశారు.   

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వెబ్‌ల్యాండ్‌ పేరుతో గతంలో జరిగిన భూ మోసాలను వెలికి తీయడంపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ భూములను పరిరక్షించే దిశగా రికార్డుల స్వచ్ఛీకరణ, ఆటోమేటిక్‌ మ్యుటేషన్లకు నిబంధనలు రూపొందించింది. సర్వే నంబర్లవారీగా వెబ్‌ల్యాండ్‌ రికార్డులు తనిఖీ చేసి ఆర్‌ఎస్‌ఆర్‌ (రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌) ఆధారంగా లావాదేవీలను తనిఖీ చేయనున్నారు.

కొంతమంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారనే విమర్శలున్నాయి. కొంతమంది బడా నాయకులు రెవెన్యూ సిబ్బందిని ముడుపులతో సంతృప్తిపరిచి ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున తమ పేర్లతో, బినామీల పేర్లతో వెబ్‌ల్యాండ్‌లో  నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల పేరుతో ఉండాలంటే తప్పకుండా దరఖాస్తు పట్టా (డీకేటీ) ఇచ్చి ఉండాలి. లేదంటే భూమి కేటాయించి ఉండాలి. ఇందుకు భిన్నంగా లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగాయి.  

రిటైర్డ్‌ అధికారుల కీలక పాత్ర 
కొందరు రిటైర్డు తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. పదవీ విరమణ/బదిలీకి ముందు భారీగా వసూళ్లు చేసి వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారు. కొందరైతే విచారణ జరిపినా బయటకు రాకుండా ఏకంగా రికార్డులు మాయం చేశారు. చాలా జిల్లాల్లో డీకేటీ రిజిస్టర్లు, భూ అనుభవ రికార్డు (అడంగల్‌), భూ యాజమాన్య హక్కుల పుస్తకం (1బి) పాతవి మాయం కావడం ఇందుకు నిదర్శనమని ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నారు. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఎక్కువగా బంజరు భూములు ఉండటమే ఇందుకు కారణం. 

ఆర్‌ఎస్సార్‌తో సరిపోల్చాలి.. 
రెవెన్యూ శాఖ అత్యంత ప్రామాణికంగా పరిగణించే బ్రిటిష్‌ కాలం నాటి ఆర్‌ఎస్‌ఆర్‌తో సరిపోల్చి సర్వే నంబర్లవారీగా డీకేటీ రిజిస్టర్, అడంగల్, 1 బి రికార్డులు, వెబ్‌ల్యాండ్‌ను పరిశీలిస్తే మోసాలు కచ్చితంగా వెలుగులోకి వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘ఉదాహరణకు ఓ గ్రామంలోని 102 సర్వే నంబరులో 30 ఎకరాలు ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రభుత్వ భూమి అని ఉందనుకుందాం. తర్వాత ప్రభుత్వం అది ఎవరికైనా అసైన్‌మెంట్‌ (డీకేటీ) పట్టా కింద ఇచ్చి ఉంటే డీకేటీ రిజిస్టర్‌లో ఉంటుంది. ఒకవేళ డీకేటీ ఇచ్చినట్లు నమోదు కాకుండా ఈ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఇతరుల పేరుతో ఉంటే అక్రమ మ్యుటేషన్‌ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది’ అని రాష్ట్ర భూ పరిపాలన సంయుక్త కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. ‘డీకేటీ పట్టాలు ఎప్పుడు ఎవరికి ఇచ్చారనే వివరాలు కలెక్టరేట్లలో ఉంటాయి. వీటి ఆధారంగా తనిఖీలు చేస్తే అక్రమాలు బయటకు వస్తాయి. అయితే అక్కడ కూడా రికార్డులు గల్లంతైతే మోసాలను వెలికి తీయడం కష్టం’ అని భూ వ్యవహారాలపై అనుభవజ్ఞుడైన ఓ రిటైర్డు ఐఏఎస్‌ అధికారి పేర్కొన్నారు.  

ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ అంటే...? 
ఏదైనా ఓ భూమిని కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే ఆ సమాచారం సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయానికి అందుతుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువు ఇచ్చి ఆమేరకు భూముల రికార్డులను రెవెన్యూ అధికారులు సవరిస్తారు. కొనుగోలుదారుడు తన పేరుతో భూ రికార్డులను మార్చుకునేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top