అభిమాన సీతయ్య

Velangi villagers recall Harikrishna Memories - Sakshi

ఈ వేలు మా నాన్నలో పవర్‌.. 
ఈ వేలు నాలోని పొగరు.. రండి రా.. రండి...
నువ్వు చంపితే అన్‌ లీగల్‌.. నేను చంపితే లీగల్‌..’’ 
‘‘అరవకు.. అరచి నీ ఆధిక్యాన్ని ప్రదర్శించకు’’ 

అంటూ పవర్‌ఫుల్‌ డైలాగులతో  అదరగొట్టాలన్నా.. 

బస్కెక్కి వస్తాను.. బండెక్కి వస్తాను.. 
కారెక్కి వస్తాను.. లారెక్కి వస్తాను.. 
రాముడై వస్తాను.. భీముడై వస్తాను.. 
కాముడై వస్తాను.. కృష్ణుడై వస్తానూ..

అంటూ స్టెప్పులతో అభిమానులను

‘లాహిరి.. లాహిరి.. లాహిరిలో..  
ఎక్కడికో తీసుకు వెళ్లడం ఆయనకే దక్కింది.
‘సీతయ్య’.. ఎవ్వరి మాటా వినడు.. అవును! నిజమే ఆయన ముక్కుసూటి మనిషి. అందుకే ఎవ్వరి మాటా వినేవారు కాదు. మనసులో ఏదనుకుంటే అదే. ఏ విషయంలోనూ నో కాంప్రమైజ్‌. అందుకే ఆయనంటే ఆ తారకరామారావుకు అమితమైన ఇష్టం. ఆయన చైతన్యరథానికి హరికృష్ణనే సారధిగా చేశారు. 

నందమూరి అభిమానులకు ఆయన ‘టైగర్‌’ హరిశ్చంద్ర ప్రసాదే.. తాతమ్మ కలతో సినీ కళారంగంలోకి అడుగుపెట్టిన ఆయన శ్రీరాములయ్యగా అందరి మన్ననలు పొందారు. దానవీరశూరకర్ణలోనూ నటించి.. సీతారామరాజు, శివరామరాజులతో జతకట్టి.. స్వామిగా శ్రావణమాసంలోనూ అలరించారు. సినీ ప్రముఖుడిగా, రాజకీయ వేత్తగా పేరొందిన నందమూరి హరికృష్ణతో జిల్లావాసులతో ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆయన తనయుడు జానకీరామ్‌కు కరప మండలం వేళంగి గ్రామానికి చెందిన యార్లగడ్డ ప్రభాకర చౌదరి కుమార్తెతో వివాహం జరిపించారు. హరికృష్ణ కుమార్తెను సైతం కాకినాడే ఇచ్చారు. ఆయన  నటించిన ఎన్నో సినిమాలు జిల్లాలోనే చిత్రీకరించారు. నల్గొండ జిల్లా నార్కెట్‌ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారన్న వార్తను జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. 

వేళంగిలో విషాదఛాయలు
కరప: మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు తనయుడు, మాజీ మంత్రి, సినీనటుడు నందమూరి హరికృష్ణ అకాల మరణంతో కరప మండలం వేళంగిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి వేళంగి గ్రామానికి అనుబంధం ఉంది. హరికృష్ణ తనయుడు జానకిరామ్‌ వేళంగి గ్రామానికి చెందిన యార్లగడ్డ ప్రభాకరచౌదరి కుమార్తె ప్రభాదీపికను వివాహమాడారు. ఈ వివాహం కాకినాడలోని టీటీడీ కళ్యాణమండపంలో జరిగింది. అప్పటి నుంచి హరికృష్ణ కుటుంబ సభ్యులు వేళంగి వస్తూ, పోతూ ఉండేవారు. 2014లో డిసెంబర్‌లో జానకిరాం జిల్లాకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రభాదీపిక, ఆమె ఇద్దరు కుమారులు తారక రామారావు, సౌమిత్ర ప్రభాకర్‌లు హరికృష్ణ కుటుంబం వద్దే ఉంటున్నారు. కాగా 2016లో డిసెంబర్‌ 24వ తేదీన మాజీ మంత్రి హరికృష్ణ, ఆయన సతీమణి, కుమారులు కళ్యాణ్‌రామ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇతర కుటుంబ సభ్యులు వేళంగిలో నిర్వహించిన హరికృష్ణ మనుమల పంచెకట్టు కార్యక్రమంలో పాల్గొని వేళంగిలోనే గడిపారు.  హరికృష్ణ మరణవార్త తెలుసుకున్న బంధువులు అందరూ బుధవారం వేళంగి నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. హరికృష్ణ గ్రామానికి వచ్చి కలుసుకున్న సంఘటనలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.

కోనసీమకూ వచ్చేవారు.. 
మామిడికుదురు: హరికృష్ణకు కోనసీమతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన ఇంటిలో ఏ శుభ కార్యక్రమమైనా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించేవారు. 2012లో జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహం కూడా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. హరికృష్ణ రెండు పర్యాయాలు కోటేశ్వరరావు ఇంటికి వచ్చారు. 2013లో ఇక్కడికి వచ్చిన సందర్భంలో రోడ్ల అధ్వాన పరిస్థితి గమనించి మొగలికుదురులో సిమెంట్‌రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.ఆరులక్షలు కేటాయించారు. 2013లో కోటేశ్వరరావు ఇంటికి వచ్చిన సందర్భంలో అక్కడి నుంచి అయినవిల్లి వరసిద్ధి వినాయకస్వామి, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను దర్శించుకున్నారు. 

తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది :  కోటేశ్వరరావు
‘‘హరికృష్ణ మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాతోపాటు మా కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా మాట్లాడేవారు. ఈ ప్రాంతానికి చెందిన పలువురు కేన్సర్‌ రోగులను ఆయన సహకారంతోనే హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించాం. ఆయన మరణం మాకు తీరనిలోటు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వెళ్లాను’’ అని కోటేశ్వరరావు ‘సాక్షి’కి వివరించారు. 

మండలానికి నిధులు..
కడియం: కడియం ప్రాంతంలో మాజీ మంత్రి నందమూరి హరికృష్ణకు అనుబంధముందని స్థానిక అభిమానులు, నాయకులు గుర్తు చేసుకున్నారు. మండలంలోని మురమండ గ్రాంలోని ఎస్సీపేట కమ్యూనిటీహాలుకు రాజ్యసభ సభ్యుడి నిధుల నుంచి రూ.ఎనిమిది లక్షలు కేటాయించారని టీడీపీ సీనియర్‌ నాయకుడు ప్రత్తిపాటి రామారావు తెలిపారు. అలాగే ఏఎంజీనగర్‌లోని కమ్యూనిటీహాలుకు ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా రూ.రెండున్నరలక్షల నిధులు మంజూరు చేశారని వివరించారు. 2010లో గ్రామంలో ఏర్పాటు  చేసిన ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు హరికృష్ణ వచ్చినప్పుడు పది ఎండ్లబళ్లను ఏర్పాటు చేసి, వాటిపై గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లినట్టు గుర్తు చేసుకున్నారు. చందన రమేష్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా ఉండగా ఆ కార్యక్రమంలో ప్రస్తుత హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు తదితరులు కూడా పాల్గొన్నారని ప్రత్తిపాటి వివరించారు. అలాగే  హరికృష్ణ రవాణా శాఖామంత్రిగా ఉన్న సమయంలో కడియం మండలం వెంకాయమ్మపేట వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును క్రేన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలు ఇరవై మంది వరకు మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి హరికృష్ణ చేరుకున్నారన్నారు. మృతులకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు, ఆర్టీసీ ద్వారా వారికి అందాల్సిన నష్టపరిహారం వేగంగా వచ్చేలా ఆయన చొరవతీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కడియం ప్రాంత నర్సరీ రైతులతో ఆయనకు పరిచయాలున్నాయని, పలు మార్లు ఆయన నర్సరీలను సందర్శించారని అభిమానులు తెలిపారు. 

గోదావరి జిల్లాతో హరికృష్ణ అనుబంధం
రాజమహేంద్రవరం కల్చరల్‌:     కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంతో హరికృష్ణకు అనుబంధం ఉంది. నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థా«పించినప్పుడు, ఆయన చైతన్యరథానికి సారధి హరికృష్ణ. 1982 జులై మూడో తేదీన ఎన్టీఆర్‌ కాకినాడకు వచ్చినప్పుడు ఆనందభారతి గ్రౌండ్స్‌లో బహిరంగసభ జరిగింది. ఆ సమయంలో హరికృష్ణ చైతన్యరథానికి సారధిగా వ్యవహరించారు. హరికృష్ణ నటించిన సీతారామరాజు షూటింగ్‌ నగరంలో జరిగింది. లాహిరి లాహిరి.. లాహిరిలో, సీతయ్య సినిమాలు కూడా ఈ జిల్లాలోనే షూటింగ్‌ జరుపుకున్నాయి.

ఎంతో హుందాగా ఉండేవారు.
‘‘నందమూరి హరికృష్ణ అకాలమరణం బాధాకరం. ఆయనతోపాటు‘ సీతయ్య’ సినిమాలో నటించాను. హరికృష్ణ ప్రవర్తన ఎంతో హుందాగా ఉండేది.  ఆయన మృతికి  ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’ అని జిల్లా సినీ జూనియర్‌ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు, ‘మా’ కార్యవర్గసభ్యుడు, నటుడు, గాయకుడు  శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రా తెలిపారు. 

నేత కార్మికుల కళానైపుణ్యం అద్భుతం : హరికృష్ణ
పిఠాపురం, కొత్తపల్లి: అచ్చుగుద్దినట్టు వివిధ కళారూపాలను నేత ద్వారా నేస్తున్న ఉప్పాడ చేనేత కార్మికుల కళానైపుణ్యం అద్భుతమని ప్రముఖ సినీనటుడు హరికృష్ణ  ప్రశంసించారు. ఆయన గత జనవరిలో కొత్తపల్లికి చెందిన చోడిశెట్టి చినబాబు ఉప్పాడలో ఏర్పాటు చేసిన భువనశ్రీ జాంధానీ చీరల విక్రయ కేంద్రం ప్రారంభం సందర్భంగా అక్కడికి వచ్చారు. తన కుమార్తె సుహాసినీని కాకినాడకు చెందిన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. సుహాసిని కుమారుడు హర్ష,  చినబాబు కుమారుడు వినయ్‌ స్నేహితులు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి హరికృష్ణ విచ్చేసి అభిమానులతో సందడిచేశారు. తన కుమారుడు జూనియర్‌ ఎన్టీర్‌ వివాహానికి తన కోడలికి ఇవ్వడానికి జాంధానీ చీరలనే కొనుగోలు చేసినట్టు ఆయన అప్పట్లో చెప్పారు.

నందరాడలో ‘సీతారామరాజు’ చిత్రీకరణ 
రాజానగరం: నాగార్జునతో కలిసి హరికృష్ణ నటించిన  సీతారామరాజు సినిమా గ్రామీణ నేపథ్యంలోనిది కావడంతో షూటింగ్‌ ఎక్కువగా నందరాడ, దోసకాయలపల్లిలో జరిగింది. 1998లో ఈసినిమా షూటింగ్‌ చూసేందుకు వచ్చే అభిమానులను ఇద్దరు హీరోలు ఆప్యాయంగా పలకరించి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు. హరికృష్ణ మాత్రం ఏదో ఒక వరుస పెట్టి పలకరించడం ఈ ప్రాంతవాసులను కట్టి పడేసింది. నందరాడలోని రైస్‌ మిల్లు, పంట పొలాల్లో తీసిన సన్నివేశాల్లో స్థానికులు కూడా నటించడంతో హరికృష్ణ జ్ఞాపకాలను వారు నెమరువేసుకుంటున్నారు. 

విజయయాత్రలో భాగంగా కాకినాడకు..
కాకినాడ కల్చరల్‌: సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణంపై కాకినాడ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 2002లో విడుదలైన లహిరి లాహిరి లాహిరిలో చిత్రం విజయ యాత్రలో భాగంగా స్ధానిక చాణుక్య థియేటర్‌కు  హరికృష్ణ  విచ్చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలరించారని  శ్రీలక్ష్మీ థియేటర్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పి.శ్రీనివాస్‌ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. చిత్ర విజయవతం చేసిన ప్రేక్షకులకు,అభిమానులను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని ఆయన అన్నారు.  చిత్ర బృందానికి   హెలికాన్‌  టైమ్స్‌(నాగమల్లితోట జంక్షన్‌)లో వసతి ఏర్పాటు చేసామని తెలిపారు.  అంతేకాకుండా హరికృష్ణ స్వయంగా   చిత్ర బృందం ప్రయాణించే వాల్వో బస్‌ను డ్రైవ్‌ చేసి   హెలికాన్‌  టైమ్స్‌కు చిత్రబృందాన్ని తీసుకెళ్లారని  ఆయన తెలిపారు. హరికృష్ణతో గడిపిన  కొద్దిపాటి సమయం కూడా తన జీవితంలో మరిచిపోలేనిదని పి.శ్రీనివాస్‌ తనకు హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’కి తెలిపారు. చిత్ర బృందంలో చిత్రం íహీరో ఆదిత్య ఓం, హీరోయిన్‌  సంఘవి కూడా ఉన్నారని ఆయన తెలిపారు. హరికృష్ణ   అకస్మిక మరణాన్ని  నగరంలో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణం తీరలని లోటని  వాపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top