అరకులోయలో అనధికార టెంట్ల జోరు

Unusual activities in Araku Valley Rental Tents Visakhapatnam - Sakshi

వాటిలో అసాంఘిక కార్యకలాపాలు

సబ్‌కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

విశాఖపట్నం,అరకులోయ: పర్యాటక ప్రాంతమైన అరకులోయలో ఎలాంటి అనుమతులు లేకుండానే రెంట్‌కు ఇచ్చే టెంట్లు అధికంగా వెలిశాయి. సుంకరమెట్ట రోడ్డులో సిమిలిగుడ జంక్షన్,రవ్వలగుడ,పద్మాపురం జంక్షన్‌ ప్రాంతాలలో కొంతమంది వ్యాపారులు టెంట్‌లను వేసి, పర్యాటకులకు రోజువారీ చొప్పున  అద్దెకు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి వద్ద నుంచి రూ.500 నుంచి రూ.1000  వరకు  అద్దె తీసుకుంటూ ఈటెంట్‌ల్లో బసకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అరకులోయ ప్రాంతంలో రెంట్‌ ఫర్‌ టెంట్‌లు ఈఏడాది అధికమయ్యాయి. టెంట్‌లను ఏర్పాటు చేసి,అద్దెకు ఇవ్వడం చట్టరీత్య నేరమని, వీటిని వెంటనే తొలగించాలని ఇటీవల పాడేరు సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాలు జారీ చేశారు.అయితే స్థానిక రెవెన్యూ అధికారులు  సబ్‌కలెక్టర్‌ ఆదేశాలను ఆమలుజేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఈ టెంట్లలో అసాంఘిక కార్యకలపాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి. రెంట్‌ ఫర్‌ టెంట్‌లలో రేవు పార్టీలు కూడా జోరందుకున్నాయని ప్రచారం జరుగుతోంది.లాడ్జిలు,రెస్టారెంట్‌లు,రిసార్ట్‌లు నిర్మించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది.అయితే టెంట్‌ల ఏర్పాటు విషయంలో మాత్రం అనుమతులు లేకుండానే ఖాళీ జాగా ఉంటే,  గిరిజనులను మచ్చిక చేసుకుని టెంట్‌లు వేస్తున్న మైదాన ప్రాంత వ్యాపారులు అధికమయ్యారు.పర్యాటకులు కూడా ఈటెంట్‌లను ఆశ్రయించి నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఈ టెంట్‌లను తొలగించాలని పాడేరు సబ్‌కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాలను స్థానిక రెవెన్యూ అధికారులు,పోలీసు యంత్రాంగం కచ్చితంగా ఆమలుజేయాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top