తీర్మానం చేసేంతవరకు పోరాటం
- ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టీకరణ
- అవసరం తీరాక చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు
- మాట తప్పితే గద్దె దిగాల్సి వస్తుంది
- ఎన్ని అడ్డంకులు కల్పించినా రేపు అసెంబ్లీని ముట్టడించితీరతాం..
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానం చేసేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని, ఇచ్చిన మాట తప్పితే ఏపీ ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి సీఎం చంద్రబాబు ఏదైనా చేస్తారనడానికి వర్గీకరణ అంశమే పెద్ద ఉదాహరణ అన్నారు. అధికారంలోకి తెచ్చే బాధ్యత మీది.. వర్గీకరణ చేసే బాధ్యత నాది అన్న బాబు అవసరం తీరిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలో లేని తెలంగాణలో వర్గీకరణపై తీర్మానం కోరిన టీడీపీ.. అధికారమున్న చోట తీర్మానం పెట్టడం లేదని, ఇది మోసం కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తక్షణం వర్గీకరణపై తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీ ముట్టడిస్తా మన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసే హక్కును లేకుండా చేయడం అమానుషమన్నారు. చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే తమ నాయకుల ఇళ్ల వద్ద నిఘా ఉంచారన్నారు. ఎక్కడా అరెస్టులు జరగకపోతే లక్షల్లో మాదిగలు అసెంబ్లీని ముట్టడిస్తారన్నారు. మాదిగలకు న్యాయం చేయలేని బాబు ఎవరినైనా మోసం చేస్తారన్నారు. వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామని 20 ఏళ్లుగా చంద్రబాబు చెప్పడాన్ని నమ్మి ఎన్నికల ముందు ఆయన పాదయాత్రకు సహకరించామని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడించడానికి టీడీపీకి మద్దతు ఇచ్చామని అన్నారు. అధికారం చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట మార్చడం ఎంత వరకు న్యాయమన్నారు.
పెద్ద మాదిగనన్నారు..
గతంలో టీడీపీ హయాంలో చేసిన వర్గీకరణను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2004 నవంబర్ 5న రద్దు చేసి, మళ్లీ అదే ఏడాది డిసెంబర్ 10న అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసిందని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా.. ఢిల్లీకి వెళ్లి అయినా వర్గీకరణ సాధిద్దామన్నారని, ఈ విషయమై ఆ పార్టీ పోలిటికల్‌బ్యూరో కూడా తీర్మానం చేసిందని చెప్పారు. 2010 అక్టోబర్ 18న ప్రతిపక్షనేతగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని చెప్పారని మందకృష్ణ గుర్తుచేశారు. ఏపీలో టీడీపీ గెలుపునకు సహకరించింది తామేనన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వర్గీకరణ జరక్కపోతే మాదిగలకు దక్కాల్సిన అవకాశాలు కూడా దక్కవన్నారు. ప్రస్తుతం జనాభా దామాషా ప్రకారం తెలంగాణలో మాదిగలకు రిజర్వేషన్ శాతం పెరిగిందని, అదే ఏపీ విషయానికి వస్తే తగ్గిందన్నారు. లక్ష్య సాధన దిశగా దశల వారీగా ముందుకు వెళతామని చెప్పారు.