నిర్ణీత సమయంలోగా విభజన పూర్తి

Union Home Secretary meeting with two state CSs - Sakshi

రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం 

9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై చర్చ

68 సంస్థలకు సంబంధించి విభజనకు అభ్యంతరం లేదన్న తెలంగాణ

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర విభజ నకు  సంబంధించిన పలు అంశాలపై దాదాపు ఏడాది తరువాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి దీనికి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా చర్చలకు నేతృత్వం వహించారు. పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల సీనియార్టీ అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల ప్రమోషన్లు జోన్ల ప్రకారం చేపడతారని, డీఎస్పీ స్థాయికి వెళ్తేనే కామన్‌ ప్రమోషన్ల కిందకు వస్తుందని, ఫ్రీజోన్‌లో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని, కేటాయింపుల ప్రకారం ప్రమోషన్లు ఇస్తామ న్న తెలంగాణ ప్రభుత్వ వాదనను కేంద్ర హోం శాఖ అంగీకరించలేదు. ఫ్రీజోన్‌ అనేది కొత్తగా వచ్చింది కాదని హోంశాఖ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీనియార్టీని నిర్ధారించాలన్న ఆంధ్రప్రదేశ్‌ వాదనతో హోంశాఖ ఏకీభవించింది. ఆ మేరకు సీనియార్టీ నిర్ధారించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

జాబితాపై ఏపీ స్పందన కోరిన కేంద్రం  
9వ షెడ్యూల్‌లోని ఆస్తుల విభజనపై కూడా సమా వేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విభజన జరగాలని ఏపీ మొదటి నుంచి పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇద్దరు సీఎస్‌ల వాదనలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి విన్నారు. ఇదే సమయంలో 68 సంస్థలకు సంబంధించి విభ జనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక జాబితాను సమర్పించింది. ఈ జాబితాపై ఆంధ్రప్రదేశ్‌ స్పందన తెలియచేయాలని హోంశాఖ కార్యదర్శి కోరారు.  

నిర్ణీత వ్యవధిలోగా పూర్తి కావాలి.. 
సింగరేణి కాలరీస్‌కి సంబంధించి విభజన చట్టంలోనే లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం హోంశాఖ దృష్టికి తెచ్చింది. షెడ్యూల్‌ 9 ప్రకారం సింగరేణి సంస్థను విభజించాలని, ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని ఉందని తెలిపింది. చట్టప్రకారం ఏం చేయాలో పరిశీలించి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. షెడ్యూల్‌ 9, 10కి సంబంధించి ఆస్తుల విభజన నిర్ణీత వ్యవధిలోగా జరగాలని హోంశాఖ అధికారులు ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేశారు. 

బకాయిల చెల్లింపుపై సుముఖం 
తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది తర్వాత పౌర సరఫరాల శాఖను ఏర్పాటు చేసుకుంది. ఈ కాలానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే గ్యారెంటీలు, అప్పులు చెల్లించింది. ఈ నేపథ్యంలో దీని విలువ ఎంతో నిర్ధారించి ఆమేరకు ఏపీకి ఇవ్వాలని హోం శాఖ సూచించింది. ఇందుకు  తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇది రూ.1,700 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ బకాయిల విషయం లో కూడా భేదాభిప్రాయాలు లేవని ఇరు రాష్ట్రాలు హోంశాఖకు స్పష్టం చేశాయి. రూ.కోట్లలో ఉన్న బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. 10వ షెడ్యూల్‌కు సంబంధించి శిక్షణ సంస్థల విభజన విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోం శాఖ వివరణ ఉందని ఏపీ ప్రభుత్వం నివేదించింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని మళ్లీ అభిప్రాయం తెలియజేస్తామంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top