చికిత్స పొందుతూ గర్భిణి మృతి | Undergoing treatment for pregnant | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ గర్భిణి మృతి

Feb 25 2014 3:39 AM | Updated on Sep 2 2018 3:44 PM

అత్తింటి వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి సోమవారం మృతి చెందింది.

 - అత్త, మామ, ఆడ బిడ్డలే చంపారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
 చిట్టమూరు, న్యూస్‌లైన్ : అత్తింటి వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి సోమవారం మృతి చెందింది. అయితే తమ బిడ్డది ఆత్మహత్య కాదని, అత్త, మామ, ఆడ బిడ్డలు కలిసి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రవినాయక్ కథనం మేరకు.. చిట్టమూరుకు చెందిన చింతాల సుబ్రహ్మణ్యం, సునీత కుమారుడు నిరంజన్‌తో చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం తీయవరం గ్రామానికి చెందిన జలగం చంద్రయ్య, భారతమ్మ కుమార్తె సుకన్య(23)కు 2011 మార్చి 11 వ తేదీన వివాహం చేశారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. సుకన్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణి.
 
 అయితే ఏడాది నుంచి సుకన్యను అదనపు వరకట్నం తేవాలని అత్తింటి వారు వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 22వ తేదీన బంగారం విషయమై అత్త సునీత, సుకన్య మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సుకన్య ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరేసుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టి సునీతను కాపాడే ప్రయత్నం చేశారు. కొనఊపిరి ఉండటంతో నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఎస్‌ఐ రవినాయక్, తహశీల్దార్ నెల్లూరుకు చేరుకుని పంచనామ నిర్వహించి, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 మా బిడ్డను పథకం ప్రకారమే హతమార్చారు
 మా బిడ్డను అత్త, మామ, ఆడ బిడ్డలు పథకం ప్రకారం దాడిచేసి గాయపరచడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. సుకన్య ఒంటిపై గాయాలు ఉన్నాయన్నారు.  సుకన్యను ఇరుగు పొరుగు ఇళ్లకు కూడా పోనివ్వకుండా ఇంట్లోనే నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేసేవారిని ఆరోపించారు. అత్త, మామలే కాకుండా ఆడ బిడ్డ అపర్ణ కూడా సుకన్యను వేధించేదన్నారు. గతంతో ఓ సంఘటన విషయమై సుకన్యతో అత్తమామలు అపర్ణ కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement