జిల్లా కేంద్రం వరకు రెండు వరుసల రోడ్లు

Two rows of roads up to the district center - Sakshi

ఎన్‌డీబీ రుణంతో రహదారుల విస్తరణ 

రూ.6,400 కోట్లతో 3,103 కిలోమీటర్ల రహదారులు, 479 వంతెనలు  

70 శాతం రుణం ఇవ్వనున్న న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు 

డిసెంబర్‌ ఆఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న రోడ్లను రెండు వరుసల రహదార్లుగా విస్తరించనున్నారు. రహదారులపై శిథిలావస్థలో ఉన్న వంతెనలను పునర్నిర్మిస్తారు. ఇందుకోసం న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఎన్‌డీబీ) 70 శాతం రుణం అందజేయనుంది. మిగతా 30 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మొత్తం రూ.6,400 కోట్లతో ఏపీ మండల కనెక్టివిటీ అండ్‌ రూరల్‌ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు(ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులను (ఏపీఆర్‌బీఆర్‌పీ) రహదారులు, భవనాల శాఖ అధికారులు చేపట్టనున్నారు. 

479 కొత్త వంతెనల నిర్మాణం
రోజుకు 2 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే రహదార్లన్నింటినీ రెండు వరుసలుగా మారుస్తారు. 3,103 కిలోమీటర్లకు పైగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు 479 కొత్త వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో రహదార్ల విస్తరణకు రూ.5,313 కోట్లు, వంతెనల నిర్మాణానికి రూ.1,087 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎన్‌డీబీ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టనున్న రూ.6,400 కోట్ల పనులకు అదనంగా రూ.2,400 కోట్లు జోడించి.. మొత్తం రూ.8,800 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అధికారులకు సూచించారు. 

రూ.2,978 కోట్లకు పరిపాలన అనుమతులు
ఎన్‌డీబీ సాయంతో ఏపీలో తొలిదశ కింద 1,243.51 కిలోమీటర్ల మేర రహదారులు, వంతెనల విస్తరణకు గాను రూ.2,978.51 కోట్ల వ్యయానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 ప్యాకేజీల కింద రూ.2,978.51 కోట్లకు గాను పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. భూ సేకరణ, ఇతర అవసరాలకు రూ.30.88 కోట్లు కేటాయించారు. తొలి దశలో రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణానికి రూ.2,978 కోట్లు విడుదల చేశామని ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. డిసెంబర్‌ ఆఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మార్చి నెల నాటికి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top