సరిహద్దులో అప్రమత్తం

Tribals fear combing operations at AOB - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ ఘటనతో  ఏవోబీలో కూంబింగ్‌

మండల కేంద్రంలో తనిఖీలు ముమ్మరం

భయందోళనలో గిరిజనులు

ముంచంగిపుట్టు(అరకులోయ): ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.  మంగళవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మ జిల్లా కిష్టరాం నుంచి పాలడికి వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ 212 బెటాలియన్‌కు చెందిన బస్సును లక్ష్యంగా చేసుకుని  మావోయిస్టులు  మందుపాతర పేల్చడంతో తొమ్మిది మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దీంతో పాటు అదే ప్రాంతంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో   పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దును ఆనుకుని ఉన్న మండలాల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు.

ఒడిశా రాష్ట్రం  ఒనక ఢిల్లీలో బీఎస్‌ఎఫ్‌ బలగాలు, జోలాపుట్టు సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు అప్రమత్తమై సరిహద్దుపై నిఘా పెట్టారు.  ఈనెల 2న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది దళసభ్యులు మృతి చెందిన విషయం తెలిసిందే. దానికి  ప్రతికారంగా మావోయిస్టులు మంగళవారం సీఆర్‌పీఎఫ్‌ బలగాలను టార్గెట్‌ చేసి మందుపాతర పేల్చినట్టు తెలిసింది.   పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేయడంతో  సరిహద్దు గ్రామాల్లో ఎప్పుడు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని    గిరిజనులు భయందోళన చెందుతున్నారు.   కొంత కాలంగా ఆంధ్ర,ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య   ప్రతికార దాడులు అధికమయ్యాయి.  ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే  ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. దీంతో అటు మావోయిస్టులకు, ఇటు పోలీసులకు మధ్య మారుమూల గ్రామాల గిరిజనులు నలిగిపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top