పండగ పూటా పస్తులే!

Tribal Devolopment Teachers Demands For Ban GO 132 - Sakshi

ఖాళీ కంచాలతో ఉపాధ్యాయుల ఆందోళన

వారపు సంతలో భిక్షాటన

జీవో నంబర్‌ 132 రద్దుకు డిమాండ్‌

విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ):  పండుగ పూట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన తమను పస్తులుంచడం సరికాదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పెదబయలులో సోమవారం భోగిపండుగ చేసుకోవాల్సిన ఉపాధ్యాయులు రోడ్డుపై ధర్నా చేశారు. గిరిజన గిరిజన ఉద్యోగ సంఘాల ఆద్వర్యంలో పెదబయలు అంబేడ్కర్‌ కూడలిలో రాస్తారోకో నిర్వహించి ఖాళీ కంచాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారపు సంతలో  అన్ని దుకాణాల్లో తిరిగి హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు భిక్షాటన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని, హెచ్‌ఎంల అధికారాలను ఏటీడబ్లు్యవోలకు బదలాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 132ను రద్దు చేయాలని, మూడు నెలల నుంచి జీతాలు లేక పండగ పూట పస్తులుండాల్సి వస్తోందని అన్నారు. గిరిజన సంక్షేమ మంత్రి వారం రోజుల్లో జీవో రద్దు చేయించి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి, ఇచ్చిన మాట మరిచారని విమర్శించారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను చులకనగా చూస్తోన్న ప్రభుత్వానికి సిగ్గురావాలనే తాము భిక్షాటన చేపట్టామని అన్నారు.  ఆందోళనలో ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంలు సైమాన్, మర్రిచెట్టు అప్పారావు, విశ్వనాథం, గిరిజన ఉపాధ్యాయులు, సాగేని లక్ష్మీనారాయణ, నిక్కుల అనంతరావు, గల్లేలు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు(పెదబయలు): ముంచంగిపుట్టులో సోమవారం ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించి, అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఖాళీ కంచాలకు ఆకులు వేసుకుని తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అందరూ ఆనందంగా పండగ జరుపుకొనే వేళ ప్రభుత్వం తమను అవస్థలు పెడుతోందని మండిపడ్డారు. 132 జీవోను రద్దు చేసి పాత పద్ధతినే  కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. గిరిజన సంక్షేమ సంఘం మండల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షకార్యదర్శులు భగత్‌రాం, నాగేశ్వరరావు, రామకృష్ణ, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top