సాక్షి, తుగ్గలి : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం అధికారులు చేపట్టిన తవ్వకాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన తవ్వకాలు మొదట తూర్పు దిక్కు నుంచి పడమర, దక్షిణ దిశగా చేపట్టారు. అక్కడ ఇటుకలు, జంతువుల ఎముకలు బయటపడి సొరంగం మాదిరిగా ఉన్నా నిధుల ఆనవాళ్లు బయటపడలేదు. దీంతో శనివారం ఈశాన్యం వైపు తవ్వకాలు మొదలుపెట్టారు. మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో కావిటీ స్కానర్ల ద్వారా కోటలో పరీక్షించారు. సొరంగ మార్గాలు, గ్యాపులు ఉన్నాయా అని పరీక్షించామని, అలాంటివేవీ కన్పించలేదని అధికారులు తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, సీఐ విక్రమసింహ పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో బయటపడిన అవశేషాలను ఇప్పటికే పురావస్తు అధికారులు పరిశీలించి.. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.
వీడని ఆశలు
కోటలో గుప్త నిధుల కోసం 11 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నా వాటి ఆనవాళ్లు బయటపడలేదు. అయినప్పటికీ ఓవైపు ప్రయివేటు ముఠా సభ్యులు, అధికారులు మాత్రం పట్టు వీడడం లేదు. ఇంకా ఎన్ని రోజులైనా తవ్వకాలు జరిపేలా ఉన్నట్లు తెలుస్తోంది. తవ్వకాలపై పలు ఆరోపణలు రావడంతో చివరకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఈ నెల 21న ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపడుతున్నామని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. తవ్వకాల కోసం తేనె రమేష్, స్వామిదాసు, ఆర్‌కే రాజు మూడు నెలల క్రితం వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. మినరల్ యాక్ట్ ప్రకారం విలువైన ఖనిజాల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తవ్వకాలు చేస్తున్నట్లు వివరించారు. అయితే.. అధికారులు చెబుతున్నట్లు కోటలో ఏనాడూ వాల్యుబుల్ మినరల్స్ కోసం గానీ, ఇతర నిక్షేపాల కోసం గానీ సర్వేలు నిర్వహించిన దాఖలాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాల ప్రారంభం ముందు గానీ, ఆ తరువాత గానీ వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయని అధికారులు చెప్పలేదు. రచ్చ తీవ్రతరం కావడంతో నాలుగు రోజులు క్రితం ఎందుకో ఉన్నఫలంగా వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇందులో అంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ పెద్దల సాయంతోనే తవ్వకాలు చేపట్టారన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.
గుప్త నిధుల ఆశ ఫలించేనా?
Dec 24 2017 8:48 AM | Updated on Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement