
వెంకన్న ఆస్తులు సీమాంధ్రకే
తిరుమల ఏడుకొండలవాడికి చెందిన ఆస్తుల విభజన సాధ్యం కాదని, వాటిపై సర్వహక్కులు అవశేష ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయంటూ గురువారం ఉత్తర్వు రూపంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాక్షి, హైదరాబాద్: తిరుమల ఏడుకొండలవాడికి చెందిన ఆస్తుల విభజన సాధ్యం కాదని, వాటిపై సర్వహక్కులు అవశేష ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయంటూ గురువారం ఉత్తర్వు రూపంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కోనేటిరాయుడు కొలువుదీరిన తిరుమల భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నా... శ్రీవారి ఆస్తులు మాత్రం తెలంగాణలో కూడా విస్తృతంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంపై జరుగుతున్న కసరత్తులో భాగంగా అధికారులు తిరుమలేశుడి ఆస్తులపైనా సమీక్షించారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తిరుమల వెంకన్న పేరిట స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఇవి ఆయా రాష్ట్రప్రభుత్వాల ద్వారా సంక్రమించినవి కావు. భక్తులు విరాళాల రూపంలో ఇచ్చినవి కావడంతో వీటిపై సర్వహక్కులు తిరుమల తిరుపతి దేవస్థానానికే ఉంటాయి. భౌగోళికంగా టీటీడీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నందున ఆయా ఆస్తులపై కూడా పూర్తి హక్కులు ఆ రాష్ట్రానికే సంక్రమిస్తాయని అధికారులు తేల్చారు.