assets divide
-
అన్నతో గొడవ..వదినను నరికేశాడు
సాక్షి, కృష్ణరాజపురం: ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి తన అన్న భార్యను కొడవలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి బెంగుళూరులోని కె.ఆర్. పురం చిక్కదేవసంద్రలో చోటుచేసుకుంది. వివరాలివి.. చిత్తూరు జిల్లాకు చెందిన మనోహర్ రెడ్డి, సుమతి(30) దంపతులు కొద్ది కాలం క్రితం చిక్కదేవసంద్రకు చేరుకొని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతంలో మనోహర్ రెడ్డి సోదరుడు వినాయకరెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇదే విషయమై అన్నదమ్ముల మధ్య గొడవ చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత మనోహర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో వినాయకరెడ్డి వదిన సుమతితో గొడవ పడ్డాడు. ఓ దశలో కోపంతో కొడవలి తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా నరికి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో సుమతి అక్కడిక్కడే మృతి చెందింది. కె.ఆర్.పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
వెంకన్న ఆస్తులు సీమాంధ్రకే
సాక్షి, హైదరాబాద్: తిరుమల ఏడుకొండలవాడికి చెందిన ఆస్తుల విభజన సాధ్యం కాదని, వాటిపై సర్వహక్కులు అవశేష ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయంటూ గురువారం ఉత్తర్వు రూపంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కోనేటిరాయుడు కొలువుదీరిన తిరుమల భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నా... శ్రీవారి ఆస్తులు మాత్రం తెలంగాణలో కూడా విస్తృతంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంపై జరుగుతున్న కసరత్తులో భాగంగా అధికారులు తిరుమలేశుడి ఆస్తులపైనా సమీక్షించారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తిరుమల వెంకన్న పేరిట స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఇవి ఆయా రాష్ట్రప్రభుత్వాల ద్వారా సంక్రమించినవి కావు. భక్తులు విరాళాల రూపంలో ఇచ్చినవి కావడంతో వీటిపై సర్వహక్కులు తిరుమల తిరుపతి దేవస్థానానికే ఉంటాయి. భౌగోళికంగా టీటీడీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నందున ఆయా ఆస్తులపై కూడా పూర్తి హక్కులు ఆ రాష్ట్రానికే సంక్రమిస్తాయని అధికారులు తేల్చారు.