ముంచేస్తున్న మృత్యుగెడ్డ
మత్స్యగెడ్డ ఎప్పటికప్పుడు మృత్యుమార్గంగా మారి పో ోతోంది. ఇందులో నాటుపడవల ప్రమాదాలతో పులువురు
మత్స్యగెడ్డలో ముగ్గురు గల్లంతు
నాటు పడవలపై రాకపోకలతో ప్రమాదాలు
హామీగా మిగిలిపోయిన వంతెనల నిర్మాణం
ముంచంగిపుట్టు: మత్స్యగెడ్డ ఎప్పటికప్పుడు మృత్యుమార్గంగా మారి పో ోతోంది. ఇందులో నాటుపడవల ప్రమాదాలతో పులువురు ప్రాణాలు కోల్పోతున్నా...ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఏళ్ల తరబడి దీనిపై వంతెనలు నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం మండలంలోని రంగబయలు పంచాయతీ పట్నాపడాల్‌పుట్టు సమీపంలో మత్స్యగెడ్డలో నాటు పడవ మునిగి పట్నాపడాల్‌పుట్టు, మఠంపుట్టు గ్రామాలకు చెందిన పాంగిరొబ్బి(25), మండి దసాయి(10), పూజారి.రాజేశ్వరి(8)లు గల్లంతయ్యారు. వీరు ఒడిశాలోని ఒనకఢిల్లీ వారపు సంతకు వెళ్లి తిరిగి నాటుపడవపై తిరిగి వస్తుండగా మునిగిపోయారు. మండలంలోని సుజనకోట, దారెల, పెదగూడ, బుంగాపుట్టు, రంగబయలు, మాకవరం, దోడిపుట్టు, పనసపుట్టు, జోలాపుట్టు పంచాయతీల పరిధిలోని 50 గ్రామాలు గెడ్డను ఆనుకొని ఉన్నాయి. ఆయా గ్రామాలవారితోపాటు ఆవలివైపున ఉన్న ఒడిశా వాసులు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాటు పడవలపై రాకపోకలు సాగిస్తుంటారు.
ఈ గ్రామాల్లోని వారు కూలి పనితోపాటు నిత్యావసర వస్తువులకు గెడ్డదాటి వెళితే తప్ప పూట గడవని దుస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు నాటు పడవ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2009లో కుంబిగూడలో 5 గురు, కుమ్మరిపుట్టులో స్నానాలకు దిగి 5 గురు, 2010లో గలగండలో నలుగురు, 2014లో రంగబయలు పంచాయతీ కొసంపుట్టులో 5గురు చిన్నారులు పడవ ప్రమాదాల్లో మృతి చెందారు. వీటితో పాటు వెలుగులోకి రాని పడవ ప్రమాదలు ఏన్నో ఉన్నాయి. మత్స్యగెడ్డపై వంతెనలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వాదన ఉంది. సమస్యను పాలకులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. ప్రమాదలప్పుడు హడావుడి చేయడం, వంతెనలు నిర్మిస్తామని, మరబోట్లు అందిస్తామని హామీలు గుప్పించడం పరిపాటిగా మారింది. హామీలన్నీ నీటిమూటలుగానే మిగులుతున్నాయని వాపోతున్నారు.


