breaking news
Matsyagedda
-
మేలో తొలి మునక!
న్యూఢిల్లీ: సువిశాల సముద్రాల గుట్టుమట్లు తెల్సుకునేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా ఆరంభించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సముద్ర ఉపరితలం నుంచి ఏకంగా 6,000 మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధన చేసే నిమిత్తం మత్స్య6000 పేరిట డీప్‌వాటర్ వెహికల్ జలాంతర్గామిని రూపొందించడం పూర్తయిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) ప్రకటించింది. అయితే తొలి దఫాలో 500 మీటర్ల లోతుకు ఈ అత్యాధునిక జలాంతర్గామిని తీసుకెళ్లబోతున్నామని ఎన్ఐఓటీ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో ఈ తొలి ప్రయోగం చేపట్టబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. 500 మీటర్ల స్థాయిలో విజయం సాధించాక తర్వాత దశలవారీగా 6,000 మీటర్ల లక్షిత లోతును చేరుకుంటామని ఎన్ఐఓటీ పేర్కొంది. 6 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో చేరుకుంటామని అంచనావేసింది. ప్రస్తుతం చెన్నైలోని ఎన్ఐఓటీ తయారీ కేంద్రంలో మత్స్య6000 విడిభాగాలను బిగించే క్రతువు కొనసాగుతోంది. 25 టన్నుల బరువైన ఈ భారీ మానవసహిత సముద్రవాహకనౌకకు ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు అత్యంత అధునిక ఉపకరణాలను అమర్చుతున్నారు. రెండో ట్రయల్స్ లేవు ‘‘లోతు తక్కువ ప్రాంతాల్లో గతంలో ఒకసారి ట్రయల్స్ చేశాం. మరోసారి ట్రయల్స్ చేసే ఆలోచన లేదు. నేరుగా అరకిలోమీటర్ లోతులోకి మత్స్య6000ను తీసుకెళ్లాలని నిర్ణయించాం. పీడన స్థాయిలు, జలాంతర్గామిలో పరిశోధకుల ప్రాణాధార అవసరాలు, నేవిగేషన్ సెన్సార్ల పనితీరును పరిశీలించబోతున్నాం. రూ.4,077 కోట్ల అంచనా వ్యయంతో 2021లో డీప్ ఓషన్ మిషన్‌ను మొదలుపెట్టాం. స్వదేశీ డిజైన్, దేశీయ ఉపకరణాల సామర్థ్యాలకు ఈ ప్రయోగం గీటురాయిగా మారనుంది’’అని ఎన్ఐఓటీ డైరెక్టర్, ప్రొఫెసర్ బాలాజీ రామకృష్ణన్ చెప్పారు. జలాంతర్గామి సాంకేతికతలో అగ్రగాములుగా కొనసాగుతున్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ల సరసన నిలబడే ఉద్దేశ్యంతో భారత్ ఈ కీలక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఏమిటీ మత్స్య6000 ? సముద్రజలాల్లో అత్యంత విలువైన ఖనిజాలు, లోహాలతోపాటు భారతదేశంపై రుతుపవనాల తీరు, వాతావరణ పరిస్థితుల ప్రభావంలో సముద్రాల పాత్రను విశ్లేషించేందుకు ఈ డీప్ ఓషన్ ప్రాజెక్ట్‌ను మొదలెట్టి అందులో భాగంగా ఇస్రో, ఐఐటీ మద్రాస్, డీఆర్డీవో తదితర సంస్థల సహకారంతో ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు ‘మత్స్య 6000ను తయారుచేశారు. గోళాకారంలో రూపొందించిన ఈ డీప్ వాటర్ వెహికల్‌ను అత్యంత కఠినమైన టైటానియంతో తయారుచేశారు. ఇది సముద్రగర్భంలో అత్యధిక పీడనాలను సైతం తట్టుకుని మత్స్య6000లోని పరిశోధకులకు రక్షణగా నిలుస్తుంది. సముద్రఅడుగున జీవజాలంపై పరిశోధనలు చేయనున్నారు. -
ముంచేస్తున్న మృత్యుగెడ్డ
మత్స్యగెడ్డలో ముగ్గురు గల్లంతు నాటు పడవలపై రాకపోకలతో ప్రమాదాలు హామీగా మిగిలిపోయిన వంతెనల నిర్మాణం ముంచంగిపుట్టు: మత్స్యగెడ్డ ఎప్పటికప్పుడు మృత్యుమార్గంగా మారి పో ోతోంది. ఇందులో నాటుపడవల ప్రమాదాలతో పులువురు ప్రాణాలు కోల్పోతున్నా...ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఏళ్ల తరబడి దీనిపై వంతెనలు నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం మండలంలోని రంగబయలు పంచాయతీ పట్నాపడాల్పుట్టు సమీపంలో మత్స్యగెడ్డలో నాటు పడవ మునిగి పట్నాపడాల్పుట్టు, మఠంపుట్టు గ్రామాలకు చెందిన పాంగిరొబ్బి(25), మండి దసాయి(10), పూజారి.రాజేశ్వరి(8)లు గల్లంతయ్యారు. వీరు ఒడిశాలోని ఒనకఢిల్లీ వారపు సంతకు వెళ్లి తిరిగి నాటుపడవపై తిరిగి వస్తుండగా మునిగిపోయారు. మండలంలోని సుజనకోట, దారెల, పెదగూడ, బుంగాపుట్టు, రంగబయలు, మాకవరం, దోడిపుట్టు, పనసపుట్టు, జోలాపుట్టు పంచాయతీల పరిధిలోని 50 గ్రామాలు గెడ్డను ఆనుకొని ఉన్నాయి. ఆయా గ్రామాలవారితోపాటు ఆవలివైపున ఉన్న ఒడిశా వాసులు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాటు పడవలపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ గ్రామాల్లోని వారు కూలి పనితోపాటు నిత్యావసర వస్తువులకు గెడ్డదాటి వెళితే తప్ప పూట గడవని దుస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు నాటు పడవ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2009లో కుంబిగూడలో 5 గురు, కుమ్మరిపుట్టులో స్నానాలకు దిగి 5 గురు, 2010లో గలగండలో నలుగురు, 2014లో రంగబయలు పంచాయతీ కొసంపుట్టులో 5గురు చిన్నారులు పడవ ప్రమాదాల్లో మృతి చెందారు. వీటితో పాటు వెలుగులోకి రాని పడవ ప్రమాదలు ఏన్నో ఉన్నాయి. మత్స్యగెడ్డపై వంతెనలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వాదన ఉంది. సమస్యను పాలకులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. ప్రమాదలప్పుడు హడావుడి చేయడం, వంతెనలు నిర్మిస్తామని, మరబోట్లు అందిస్తామని హామీలు గుప్పించడం పరిపాటిగా మారింది. హామీలన్నీ నీటిమూటలుగానే మిగులుతున్నాయని వాపోతున్నారు.


