ఈ హెడ్మాస్టర్ మాకొద్దు | This head master don't want | Sakshi
Sakshi News home page

ఈ హెడ్మాస్టర్ మాకొద్దు

Jan 20 2014 3:24 AM | Updated on Sep 2 2017 2:47 AM

ఈ హెడ్మాస్టర్ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఇతను మాకొద్దు అంటూ మండలంలోని మహదేవపల్లె జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు,వారి తల్లిదండ్రులు మండిపడ్డారు.

చక్రాయపేట, న్యూస్‌లైన్: ఈ హెడ్మాస్టర్ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఇతను మాకొద్దు అంటూ  మండలంలోని మహదేవపల్లె జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు,వారి తల్లిదండ్రులు  మండిపడ్డారు. పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్‌ను రెండు నెలలుగా వేధింపులకు గురిచేయడమే కాకుండా శనివారం ఆమెపట్ల  ప్రధానోపాధ్యాయుడు కృష్ణానాయక్ అసభ్యంగా ప్రవర్తించడంతో   విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆదివారం  బైఠాయించారు.దీంతో రాయచోటి-వేంపల్లె ప్రధాన రహదారిలో సుమారు 5గంటల పాటు రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తహశీల్దారు నాగేశ్వరరావు, డిప్యూటీ డీఈవో రంగారెడ్డి,ఎంఈవో రవిశంకర్ సర్దిచెప్పినా వినలేదు.  డీఈవో వచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు డీఈవో వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పినా వినిపించుకోలేదు.  మీమపై నమ్మకం లేదు..సస్పెండ్ చేశామని చెప్పాల్సిందేనని  తేల్చి చెప్పారు. డీఈవో తహశీల్దారు కార్యాలయంలో కూర్చొని ఉన్నవిషయం తెలుసుకున్న  విద్యార్థులు ఆయన ఉన్న గదికి తాళం వేసి  నినాదాలు చేశారు.
 
  తమను సారాప్యాకెట్లు తెమ్మంటున్నాడని, ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. తమను మోకాళ్లపైకే దుస్తులు వేసుకోమంటున్నాడని బాలిక లు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని హెడ్మాస్టర్‌ను వదిలేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓపై మండిపడ్డారు. ఆర్జేడీకి సమాచారం అందించి సోమవారం ఉదయం  సస్పెండ్ ఆర్డర్స్ ఇస్తామని డీఈఓ చెప్పినా విద్యార్థులు వినలేదు. సప్పెండ్ ఆర్డర్ ఇచ్చారనే విషయం తమకు తెలిసే వరకూ పాఠశాల తలుపులు తెరిచేది లేదని తేల్చిచెప్పారు.  
 
 ఎందుకు చర్యలు తీసుకోలేదు
 2009 నుంచి కృష్ణనాయక్ చేస్తున్న  వేధింపులపై  విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి,యూత్ కన్వీనర్ వెంకట సుబ్బయ్య,సింగిల్ విండో అధ్యక్షుడు శేషారెడ్డి,మాజీ రెస్కో  చైర్మన్  శివప్రసాద్‌రెడ్డి, బీజేపి జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి డీఈవో అంజయ్యను నిలదీశారు.
 
 హెడ్మాస్టర్‌పై  చర్యలు తీసుకోవాలని యేడాదిన్నర్ర క్రితం విజిలెన్స్ వారు ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.  విద్యార్థులు చేసిన ఆందోళనలు,వారి ఆరోపణలతో పాటు అప్పటి డిప్యూటీ డీఈవో  సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తూ ఇచ్చిన నివేదికలు సుమారు వంద పేజీలతో కూడిన ఆరోపణలను డీఈవోకు ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 కేసు నమోదు
 హెడ్‌మాస్టర్ కృష్ణానాయక్‌పై పాఠశాల మహిళా టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు. రెండు నెలలుగా తనను వేధిస్తున్నాడని, శనివారం తన గొంతు పట్టి నొక్కాడని  చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అంతేగాక కృష్ణానాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
 నిర్భయ కేసు నమోదుచేయాలి    
 బాలికలని చూడక  తాళాలతో పొడుస్తాడు. ఈయన వేధింపులు భరించ లేకున్నాం. టీచర్లపైనే ఇలా ప్రవ ర్థిస్తే   మా పరిస్థితి ఏమిటి. ఈయన ఉపాధ్యాయ వృత్తికే అనర్హుడు. నిర్భయ కేసు నమోదు చేస్తేనే గుణపాఠం వస్తుంది.    
 - నందిని, విద్యార్థి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement