కారంచేడులో దొంగల హల్‌చల్‌ | Thievs Gang Robbery In Karamchedu Prakasam | Sakshi
Sakshi News home page

కారంచేడులో దొంగల హల్‌చల్‌

Sep 23 2018 1:37 PM | Updated on Sep 23 2018 1:37 PM

Thievs Gang Robbery In Karamchedu Prakasam - Sakshi

ఆధారాలు సేకరిస్తున్న ఒంగోలు క్లూస్‌ టీమ్‌

ప్రకాశం, కారంచేడు: తాళం వేసి ఉన్న ఇంట్లోకి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. నిత్యం రద్దీగా ఉండే సెంటర్‌లోనే ఇలాంటి దొంగతనం జరగడంతో ఆ ప్రాంత ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే చీరాల రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఒంగోలు నుంచి క్లూస్‌ టీమ్‌తో పాటు డాగ్‌ స్క్వాడ్‌లు వచ్చి ఆధారాలు సేకరించాయి. అనంతరం చీరాల రూరల్‌ సీఐ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కారంచేడు స్టేట్‌ బ్యాంక్‌ సెంటర్‌లో నివాసం ఉంటుంన్న నల్లూరి ఆంజనేయులు కుమారుడు అమెరికాలో ఉంటుండంతో మూడు నెలల క్రితం ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. అప్పటి నుంచి ఆ ఇంటికి తాళం వేసి ఉంది.

అప్పుడప్పుడూ అదే గ్రామంలో ఉండే ఆంజనేయులు తండ్రి సుబ్బారావు, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి చూసి వెళ్తుంటారు. ఈ క్రమంలో శనివారం వేకువ జామున దొంగలు ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న బీరువాను కింద పడేసి అక్కడే తలుపులు పగులగొట్టి దానిలోని దుస్తులు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేశారు. తెల్లారిన తర్వాత స్థానికులు గమనించి సుబ్బారావుకు సమాచారం అందించారు. ఆయనిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థ«లానికి చేరకున్నారు. ఒంగోలుకు చెందిన క్లూస్‌ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.కోటేశ్వరారవు తన సిబ్బందితో వచ్చి వేలిముద్రలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ వచ్చి దొంగతనం జరిగిన ఇంటి నుంచి బయల్దేరి కాలువ సెంటర్‌లోని టీ కొట్టు వద్దకు వచ్చి మళ్లీ వెనుదిరిగి అదే ఇంటి వద్దకు వచ్చి ఆగింది. ఇంట్లో ఏ వస్తువులు పోయింది యజమానులు వస్తేగానీ తెలియదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement