రాష్ట్రంపై జీఎస్‌టీ ప్రతికూల ప్రభావం లేదు

There is no negative effect on GST on the state - Sakshi

వాణిజ్యశాఖ సమీక్ష సదస్సులో ఆర్థికమంత్రి యనమల

సాక్షి, అమరావతి: జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్ర వృద్ధిరేటుపై ఎటువంటి ప్రతికూల ప్రభావంలేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధిరేటు పెరుగుతోందన్నారు. గతేడాదిలో ఆరు నెలల కాలానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 10.71 శాతంగా ఉంటే అది ఈ ఏడాది 11.73గా నమోదయ్యిందన్నారు. గురువారం విజయవాడలో వాణిజ్య శాఖ్య పన్నుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా యనమల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు ఒక్క రియల్‌ ఎస్టేట్‌ రంగంపై మాత్రమే ప్రతికూల ప్రభావం చూపిందని, దీంతో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు.

ఈ ఏడాది వాణిజ్య శాఖకు రూ. 40,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తే మొదటి ఆరు నెలల్లో ఇందులో 44 శాతం చేరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోతోందన్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోలేనే రూ. 30,000 కోట్ల వరకు అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పెట్రోల్‌పై అదనంగా పెంచిన రూ. 4 వ్యాట్‌ను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు యనమల స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో బంకులు మూత పడుతుండటంతో అదనపు వ్యాట్‌ను రూ. 2 వరకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top