
వైఎస్ ఫొటో తిరిగి పెట్టనక్కర్లేదు
శాసనసభ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టాల్సిన అవసరం లేదని శాసనసభ సాధారణ వ్యవహారాల కమిటీ(జీపీసీ) నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: శాసనసభ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టాల్సిన అవసరం లేదని శాసనసభ సాధారణ వ్యవహారాల కమిటీ(జీపీసీ) నిర్ణయించింది. శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లేకుండా అధికార టీడీపీ, దాని మిత్రపక్ష బీజేపీ సభ్యులతో కూడిన జనరల్ పర్పసెస్ కమిటీ ఈ మేరకు తీర్మానించింది. మంగళవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభ లాంజ్‌లో ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్ చిత్రపటాన్ని త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో తొలగించిన విషయం తెలిసిందే.
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాయగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నిరసనను తెలియజేశారు. ప్రతిపక్షానికి తగిన ప్రాతినిథ్యం కల్పించకపోవడమే కాకుండా లేని అంశాన్ని తెరమీదకు తెచ్చి కావాలని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టాలని డిమాండ్ చేశారు. 25 మంది సభ్యులున్న కమిటీలో ముగ్గురు ప్రతిపక్ష సభ్యులకే స్థానం కల్పించినందుకు నిరసనగా సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది.
ఈ విషయంలో విమర్శలు రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన కమిటీని నియమించి ఒక సంప్రదాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని పలువురు చేసిన సూచనలను కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. వైఎస్ ఫోటోను ఏకపక్షంగా తొలగించిన తీరు తప్పుడు సంకేతాలిచ్చాయని వ్యాఖ్యానించిన కొందరు సభ్యుల అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. అధికార పార్టీకి చెందిన మెజారిటీ సభ్యులు వైఎస్ ఫొటోను తిరిగి యధాస్థానంలో పెట్టాల్సిన అవసరం లేదన్న మాటకు సమావేశం ఆమోదం తెలపడంతోపాటు తొలగించడాన్ని సమర్థించింది. కమిటీని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను సమావేశంలో సభ్యులందరికీ పంపిణీ చేశారు.
సమావేశం అనంతరం చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ లాంజ్‌లో స్పీకర్ల ఫోటోలు తప్ప మరెవరి ఫోటోలను పెట్టొద్దని కోరినట్టు చెప్పారు. శాసనసభ లాంజ్‌లో వైఎస్సార్ చిత్రపటాన్ని నిబంధనలకు విరుద్ధంగా చేశారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని రెండు రాష్ట్రాలకు విభజించారని తెలిపారు. ఆ సమయంలో తెలంగాణకు వెళ్లిన కమిటీ హాళ్లలో ఉన్న పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటాలను ఆ రాష్ర్ట సిబ్బంది తొలగించి ఏపీకి అప్పగించారని, వాటి మాదిరిగానే మేకు ఊడిపోయిన వైఎస్ చిత్రపటాన్ని కూడా స్టోర్ రూమ్‌లో భద్రపరిచారని చెప్పారు.
ఇంటి అద్దె పెంచండి
ప్రస్తుతం హైదరాబాద్‌లో తాము నివాసం ఉండేందుకు ఇస్తున్న ఇంటి అద్దెను పెంచాల్సిందిగా స్పీకర్ కోడెలకు శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల ఇళ్లకు రూ. 25 వేలు అద్దెగా చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ. 50 వేలకు పెంచాల్సిందిగా ఎమ్మెల్యేలు కోరారు. తమకు కేటాయించిన గృహాల్లో సౌకర్యాలు సరిగా లేవని, వాటి మరమ్మతులకే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోందని మంగళవారం జరిగిన జీపీసీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పారు. ఏపీ నూతన రాజధానిలో తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పీకర్‌ను కోరారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విష్ణుకుమార్ రాజుకు స్పీకర్ సూచించారు.