రెండు రాష్ట్రాలకూ ప్రస్తుత చట్టాలే | The two states   The current regulations | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలకూ ప్రస్తుత చట్టాలే

May 28 2014 3:15 AM | Updated on Sep 2 2017 7:56 AM

రెండు రాష్ట్రాలకూ  ప్రస్తుత చట్టాలే

రెండు రాష్ట్రాలకూ ప్రస్తుత చట్టాలే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యే అపాయింటెడ్ డే కు ముందు రోజు వరకు ఉన్న చట్టాలే ఇరు రాష్ట్రాలకు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త ప్రభుత్వాలు మార్పులు చేసుకునే వరకు వర్తింపు
 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు


 హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యే అపాయింటెడ్ డే కు ముందు రోజు వరకు ఉన్న చట్టాలే ఇరు రాష్ట్రాలకు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. విభజనకు పూర్వం చేసిన చట్టాలను రెండు రాష్ట్రాలు.. తమతమ చట్టసభల్లో ఏవైనా సవరణలు చేసుకోవడం లేదా వాటిని పూర్తిగా రద్దుచేయడం వంటివి చేసేవరకు ఇవే కొనసాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 2(ఎఫ్)లో పేర్కొన్న విధంగా చట్టాలు, ఆర్డినెన్స్‌లు, నియంత్రణ, ఆదేశాలు, బైలా, నిబంధనలు, పథకం, నోటిఫికేషన్ తదితరమైనవి ఇరు రాష్ట్రాల్లో కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973కు సంబంధించి రాష్ట్రాల సరిహద్దులు మారుస్తూ.. రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేసేవరకు అదే చట్టం అమలవుతుందన్నారు.

ప్రస్తుత చట్టాలకు కాలపరిమితి ఉన్నప్పుడు, ఆ కాలపరిమితి ముగియడానికి రెండేళ్ల ముందు వాటిని మార్చడం లేదా కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. కోర్టులు, ట్రిబ్యునల్స్, అథారిటీలకు సంబంధించిన చట్టాల్లో మార్పు చేసే సమయంలో స్థూల విషయం దెబ్బతినకుండా.. మార్పు చేయవచ్చన్నారు. చట్టాల మార్పుతో పాలన స్తంభించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గతంలో సుప్రీంకోర్టు రెండు కేసుల్లో స్పష్టంచేసిన అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అపాయింటెడ్ డేకు ముందు ఉన్న చట్టాలు ఒకవేళ కాలం చెల్లినవైన పక్షంలో వాటిని మార్చుకోవడం, అవసరమైతే రద్దు చేసుకునే అధికారం కొత్తగా ఏర్పాటయ్యే శాసనసభలకు ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement