గోదావరి మణిహారం పూర్తయ్యేదెప్పటికో..! | the two-lane bridge on Godavari river connecting with east and west godavari districts | Sakshi
Sakshi News home page

గోదావరి మణిహారం పూర్తయ్యేదెప్పటికో..!

Jan 22 2014 2:24 AM | Updated on Sep 2 2017 2:51 AM

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై రెండు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి 2009 మే నెలలో శ్రీకారం చుట్టారు.

 తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై రెండు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి 2009 మే నెలలో శ్రీకారం చుట్టారు. గామన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) పద్ధతిపై పనులను చేపట్టారు. ప్రభుత్వం ముందుగా నిర్దేశించిన ప్రకారం 2013 మే నెలాఖరుకు పనులు పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి.

 గడువు పూర్తయి 8 నెలలు కావస్తున్నా పనులు మొక్కుబడి తంతుగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కొవ్వూరు వైపు పెండింగ్‌లో ఉందన్న సాకుతో నిర్మాణ పనులను నిలిపివేశారు. ఇటీవల భూ సేకరణకు కోర్టు అడ్డంకులు తొలిగినా పనుల్లో పురోగతి లేదు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించినా పనులు పూర్తికాకపోవడంతో 2014 మే నెలాఖరు వరకు గడువు పెంచారు.

గత నవంబర్ 12న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. 2014 ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినా ప్రయోజనం లేదు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగడానికి అనుకూలంగా ఉన్నా కాంట్రాక్ట్ సంస్థ ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

 4.1 కి.మీ.. 164 పిల్లర్లు
 గోదావరి నదిపై 4.1 కిలోమీటర్ల పొడవున, 10.3 మీటర్లు వెడల్పు గల రెండు లైన్ల రోడ్డు వంతెన నిర్మిస్తున్నారు. వంతెనకు కుడి వైపున 82 పిల్లరు, ఎడమవైపున 82 పిల్లర్లు ఉన్నాయి. వీటిపై వాహనాలు రాకపోకలు సాగేందుకు అనువుగా ముందుగానే తయారు చేసిన సిమెంట్ సిగ్మెంట్లను అమర్చారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది.

 ఎడమ వైపున..
 ఎడమ వైపున 1 నుంచి 30వ పిల్లర్ వరకు సిగ్మెంట్ల అమరిక, 30వ పిల్లర్ నుంచి 53వ పిల్లర్ వరకు జాయింట్లు అతకడం పూర్తయింది. 53 నుంచి 82వ పిల్లర్ వరకు జాయింట్లను అతకాల్సి ఉంది. వీటికి తోడు వంతెన సైడు నిర్మించే రెయిలింగ్స్‌కు కాంక్రీటు పనులు చేపట్టాల్సి ఉంది.

 కుడి వైపున..
 కుడి వైపున 1 నుంచి 16వ పిల్లర్ వరకు రెయిలింగ్‌తో సహా రెండు లైన్ల వంతెనను పూర్తి స్థాయిలో నిర్మించారు. 30వ పిల్లర్ నుంచి 40వ పిల్లర్ వరకు ఫుట్‌పాత్ రెయిలింగ్స్, 40వ పిల్లర్ నుంచి 82వ పిల్లర్ వరకు సైడ్ రెయిలింగ్‌తోపాటు ఫుట్‌పాత్ రెయిలింగ్ పనులు పూర్తికాలేదు. సిగ్మెంట్ల జాయింట్లను అతికి రహదారి స్వరూపం ఏర్పడిన తరువాత దీనిపై బీటీ రోడ్డు నిర్మించాల్సి ఉంది.

 ముందుకు సాగని అప్రోచ్ రోడ్లు
 తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుంచి జాతీయ రహదారి వరకు 9 కి.మీ., కొవ్వూరు వైపు 1.98 కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్లను నిర్మించాల్సి ఉంది. దీనిలో కొవ్వూరు వైపు 4.55 ఎకరాల భూమి కోర్టు వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉండటంతో పనులు నిలిచిపోయాయి. ఇటీవల కోర్టు అడ్డంకులు తొలగడంతో రెవెన్యూ అధికారులు ఈ భూమిని కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. రెండు రోజుల నుంచి ఈ భూముల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు.

 తూర్పుగోదావరి జిల్లాలో భూ సేకరణ ప్రక్రియ పూర్తయి చాలాకాలం గడిచినా అప్రోచ్ రోడ్డు నిర్మాణం మాత్రం అసంపూర్తిగానే ఉంది. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లోని రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు సాగడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో అప్రోచ్ రోడ్డు కోసం భూమిని సీఆర్‌బీతో నింపి సరిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement