
బతికేదెలా?
గత కొన్నాళ్లుగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడి బడ్జెట్ లకిందులవుతోంది. పంచభక్ష పర్వాన్నాలకు ఎలాగూ గతి లేదు.
ఎండలే కాదు... నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. పేదలు పట్టెడన్నం తినలేని పరిస్థితి. బియ్యం ధర భగ్గుమంటోంది. పప్పు దినుసులు పేలాల్లా వేగుతున్నాయి. పాలు, పంచదార కూడా చేదెక్కాయి. నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోలు, డీజిల్ ధరలు రాకెట్‌లా దూసుకుపోవడం మధ్యతరగతి ప్రజలకు అ‘ధనం’. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు బతికి బట్టకట్టేదెలా..?
సత్తెనపల్లి: గత కొన్నాళ్లుగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడి బడ్జెట్ లకిందులవుతోంది. పంచభక్ష పర్వాన్నాలకు ఎలాగూ గతి లేదు. రెండు పూటలా నాలుగు ముద్దలు నోట్లో కెళ్లాలి గదా... మార్కెట్‌లో బియ్యం కొందామంటే కిలో యాభై అంటున్నారు. కందిపప్పు, మినప్పప్పు, ఇతర పప్పు దినుసులు కూడా తారాజువ్వలా దూసుకుపోయాయి. పొద్దున్నే కాస్త కాఫీ, టీలు తాగే అలవాటు కదా పాలు పోయించుకుందామంటే అది కూడా లీటరు 50 రూపాయలై పోయింది. ఉదయం టిఫిన్‌కి మినప్పప్పు కొందామంటే బాబోయ్... ధర చూస్తే బేజారవుతోంది. బయటకొచ్చి ఆటో ఎక్కితే వాళ్లు కూడా డీజిల్ ధర పెరిగిందని రేట్లు పెంచేశారు. సొంత వాహనంపై ఉంటే పెట్రోలు ధర ఈ రోజు ఉన్న ధర రేపు ఉండదు... అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఏది ముట్టుకున్నా భగ్గుమంటోంది. ఎండలే కాదు...ధరలు కూడా మండిపోతున్నాయి. ఇలా అయితే బతికేదెలా... అని సామాన్యుడి సణుగుడు...గత మూడేళ్లుగా నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తుండడం వలన ఏ వస్తువూ కొనలేని పరిస్థితి.
ఈ రోజు ఉన్న ధర మరో రెండు రోజులు ఆగితే ఉండదు. ఎప్పుడు ఏ వస్తువు ధర పెరుగుతుందో కూడా తె లియని పరిస్థితి. మొన్న డీజిల్ ధర, నిన్న పాల ధర మరి నేడు ఏ వస్తువు ధర పెరుగుతుందో తెలియకుండా ఉంటుందని పేద, మధ్య తర గతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పేదల సంపాదనకు, ఖర్చులకూ ఎక్కడా పొంతన లేకుండా ఉండడం వలన పేదలు అర్థాకలి తోనే జీవనం సాగిస్తున్నారు. పాల నుంచి పంచదార వరకు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఎలాంటి దురలవాట్లు లేని వారు సైతం అప్పులు చేస్తూ కుటుంబాలను వెళ్లదీస్తున్నారు.
ఏడాదిలో మూడు సార్లు పెరిగిన పాల ధర
ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు అందరికి అవసరమైనవి పాలు. టీ, కాఫీలకు గాని, రోజూ భోజనంలో పెరుగు, మజ్జిగకు గానీ పాలు అవసరం. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పాల వినియోగం ఇంకా అధికమే. పాల ధర ఈ ఏడాదిలోనే మూడుసార్లు పెరిగింది. ప్రస్తుతం డెయిరీల్లో కొనుగోలు చేసే పాల ధర రూ.44 వరకు ఉంది. ఇక నేరుగా గేదె నుంచి పితికిన పాలైతే రూ.50 వరకు పెట్టక తప్పడం లేదు. ఒక్కొక్క కుటుంబం రోజుకు కనీసం లీటరు పాలు వాడినా నెలకు రూ. 1500 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. పాల రేట్లు గణనీయంగా పెరుగుతుండడంతో పేదలు టీ, కాఫీలకు మంగళం పాడాల్సివస్తోంది.
బియ్యం,పప్పుల ధరలు పైపైకి...
ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా అవసరమైన నిత్యావసరాల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. బియ్యం, పప్పుల ధరలు అందుబాటులో లేని విధంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం సన్న బియ్యం ధరలు కిలో రూ.50 వరకు ఉన్నాయి. నిత్యం వినియోగించే మినప, కందిపప్పు, శనగపప్పు సైతం ఏడాదిలో కిలో రూ.20 వరకు పెరిగాయి. నూనెలు కూడా కిలోకు రూ.15 నుంచి, రూ.20 వరకు పెరగడం వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
డీజిల్, పెట్రోల్ సంగతి సరేసరి...
డీజిల్ ధరల ప్రభావం ప్రజలపై నేరుగా ఉండకపోయినా పరోక్షంగా భారం అధికంగానే ఉంటుంది. నిత్యావసరాల ధరలపై ఇంధన ప్రభావం కనిపిస్తుంది. ఆయిల్ రేట్లు పెరిగినప్పుడల్లా వాటి ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. రెండు రోజుల కిందట లీటరు డీజీల్‌పై రూ.61పైసలు పెంచారు.
మరికొద్ది రోజుల్లో మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గడిచిన మూడేళ్లలో లీటరు పెట్రోల్‌పై రూ.18 వరకు పెరిగింది. ప్రసుత్తం పెట్రోల్ ధర రూ.79 ఉంది. చిరు వ్యాపారుల నుంచి సామాన్య వర్గాల వరకు ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక ద్విచక్ర వాహనం తప్పనిసరిగా ఉంటుంది. పెరిగిన ధరలతో నెల బడ్జెట్‌లో పెట్రోలు బిల్లు అధికమైపోతోంది.