వర్షం కురవాలి.. సిరులు పండాలి | Sakshi
Sakshi News home page

వర్షం కురవాలి.. సిరులు పండాలి

Published Sun, Aug 3 2014 1:07 AM

The residents of the colony to take up arms for the rain

వర్షాలు పుష్కలంగా కురిసి సిరులు పండాలని కాంక్షిస్తూ ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీవాసులు దాదాపు వెయ్యి మంది పూజారి తిమ్మప్ప ఆధ్వర్యంలో గుంటె రంగస్వామికి తుంగభద్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు.
 
 ఎమ్మిగనూరు టౌన్:  వర్షం కోసం ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీ వాసులు ఆయుధాలు చేపట్టారు. వీటితో పూజారి తిమ్మప్ప ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది పాదయాత్రగా నందవరం మండలంలోని గంగవరానికి వెళ్లారు. అక్కడ తుంగభద్ర జలాలను తీసుకొని శుక్రవారం అర్ధరాత్రి తిరుగు పయానమయ్యారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పట్టణానికి చేరుకున్నారు. తుంగభద్ర జలాల బిందెతో పూజారి తిమ్మప్ప, కాలనీ వాసులు పట్టణంలోని వీధుల గుండా బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు వెంకటాపురం కాలనీకి చేరుకున్నారు. దారిపొడువున మహిళలు పూజారికి కాళ్లకు జలాభిషేకం చేసి ఆహ్వానం పలికారు. శ్రీగుంటె రంగస్వామి ఆలయం చుట్టూ ఐదుసార్లు పూజరితో పాటు జలాల కోసం వెళ్లిన ప్రజలు ప్రదక్షణ చేశారు. ప్రదక్షణ సందర్భంగా తమ కోర్కేలు తీర్చుకునేందుకు మహిళలు పూజారి కాళ్లకు అడ్డం పడుతూ సాష్టాంగ నమస్కారాలు చేశారు.  కాలనీలోని శ్రీగుంటెరంగస్వామికి పూజారి జలాభిషేకం చేశారు. అనంతరం శ్రీవెంకటేశ్వరస్వామి, లక్ష్మమ్మ అవ్వ, ఆంజనేయస్వామితో పాటు గ్రామదేవతలకు నదీ జలాలతో అభిషేకించారు.
 
 వర్షం కురవాలి..సిరులు పండాలంటూ శ్రావణమాసం మొదటి శనివారం ప్రతి ఏడాదీ దేవతలను తుంగభద్ర జలాలతో అభిషేకిస్తామని కాలనీ వాసులు తెలిపారు. నదీ జలా లు తీసుకొచ్చే సమయంలో అడవి జంతువుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు పూర్వీకులు ఆయుధాలు తీసుకెళ్లేవారని, ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.  కౌన్సిలర్లు భాస్కర్‌రెడ్డి, నాగమ్మ, కాలనీ పెద్దలు నీలకంఠరెడ్డి,  బజారి, బి.జగన్నాథ్‌రెడ్డి, రంగన్న, పాండు, గుంటె రంగస్వామి పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement