‘దుర్గం’ దేశంలో అల్లకల్లోలం | The party said the move straight to burn a model of political constituency | Sakshi
Sakshi News home page

‘దుర్గం’ దేశంలో అల్లకల్లోలం

Feb 28 2014 2:47 AM | Updated on Aug 11 2018 3:37 PM

రాయదుర్గం నియోజకవర్గం టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీని నిలువునా దహించి వేస్తోంది. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డికి పోటీగా ఉషారాణిని ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి తెరపైకి తెచ్చారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాయదుర్గం నియోజకవర్గం టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీని నిలువునా దహించి వేస్తోంది. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డికి పోటీగా ఉషారాణిని ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి తెరపైకి తెచ్చారు. తనకు టికెట్ ఇవ్వని పక్షంలో ఉషారాణికి అవకాశం ఇవ్వాలని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. ఇక మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులుతో కలిసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మంగళవారం రాత్రి అధినేత చంద్రబాబుతో సమావేశమై.. రాయదుర్గం నుంచి కాలవకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు.
 
 ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన దీపక్‌రెడ్డి.. అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని బుధవారం రాత్రి ప్రకటించారు. రాయదుర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా చీలిపోవడంతో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రెండున్నరేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు.. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి ఒప్పందం కుదిరింది. ఆ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి విజయానికి జేసీ దివాకర్‌రెడ్డి కృషి చేశారు. ఆ ఒప్పందంలో భాగంగానే రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ టికెట్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డికి ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో దీపక్‌రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు.
 
 ఓడిపోయిన దీపక్‌రెడ్డినే రాయదుర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. అదే సమయంలో 2014 ఎన్నికల్లో కూడా తనకే టీడీపీ టికెట్ దక్కుతుందని దీపక్‌రెడ్డి భావించారు. కానీ.. రాయదుర్గం టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కన్నేశారు. నియోజకవర్గంలో దీపక్‌రెడ్డికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని.. తనకే టికెట్ ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం మూడున్నరేళ్లు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పారు.
 
 వ్యూహం మార్చిన మెట్టు..
 తనకు టికెట్ దక్కే అవకావం లేకపోవడంతో మెట్టు వ్యూహం మార్చారు. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఉషారాణిని.. జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ వద్దకు మెట్టు తీసుకెళ్లారు. దేవెగౌడ ద్వారా చంద్రబాబుకు లేఖ రాయించి.. ఉషారాణికి టికెట్ ఇప్పించాలని కోరారు. చంద్రబాబూకు దేవేగౌడకు ఉన్న సంబంధాల రీత్యా ఉషారాణిని నియోజకవర్గంలో పనిచేసుకోవాలని ఆయన సూచించారు. ఇదే అదనుగా తీసుకున్న ఉషారాణి నియోజకవర్గంలో విసృ్తతంగా పర్యటిస్తున్నారు.
 

 మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఉషారాణి తనకు పోటీగా పర్యటిస్తోండటంతో దీపక్‌రెడ్డి తీవ్రంగా ఆగ్రహించారు. ఆమె పర్యటనలను అడ్డుకునేలా తన వర్గీయులను ఉసిగొల్పారు. ఎమ్మెల్సీ మెట్టు, ఉషారాణి ఒక వర్గంగా.. దీపక్‌రెడ్డి మరో వర్గంగా విడిపోవడంతో ఆ స్థానంపై కాలవ శ్రీనివాసులు కన్నేశారు. మంగళవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశం కావాలని తొలుత కాలవ భావించారు. తనకు తోడుగా మరో బీసీ నేత ఉంటే బలం చేకూరుతుందనే భావనతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని కూడా తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి చంద్రబాబుతో అర్ధగంట పాటు  చర్చించారు.
 
 రాయదుర్గంలో తన సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయని.. ఇరు వర్గాలు విభేదిస్తున్న దృష్ట్యా, ఆ టికెట్ తనకు కేటాయించాలని చంద్రబాబును కాలవ కోరారు. ఈ ప్రతిపాదనను బీకే పార్థసారథి బలపరిచారు. అనంతపురం లోక్‌సభ, తాడిపత్రి శాసనసభ టికెట్లు జేసీ బ్రదర్స్‌కు ఇస్తోన్న నేపథ్యంలో.. రాయదుర్గం టికెట్‌ను వారి అల్లుడైన దీపక్‌రెడ్డికి కేటాయిస్తే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పంపినట్లు అవుతుందని వారిద్దరూ వాదించారు. ఈ వాదన విన్న చంద్రబాబు.. ‘చూద్దాం.. చేద్దాం’ అంటూ కాలవకు ఎలాంటి హామీ ఇవ్వనట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

 దూకుడు పెంచిన దీపక్‌రెడ్డి..
 ఎమ్మెల్సీ మెట్టు, ఉషారాణి ఓ వైపు.. కాలవ, బీకే మరో వైపు రాయదుర్గం టికెట్ కోసం ప్రయత్నిస్తోండటంపై దీపక్‌రెడ్డి మండిపడుతున్నారు. రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో తాను పోటీ చేసి, భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేశానని ఆయన చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీని వీడలేదని, శ్రేణులకు అండగా ఉన్నానని అంటున్నారు.
 
  కానీ.. తనను అధిష్టానం గుర్తించడం లేదని వాపోతున్నారు. నియోజకవర్గంలో శ్రేణులు మొత్తం తననే అభ్యర్థిగా నిలపాలని డిమాండ్ చేస్తున్నా.. అధిష్టానం చెవికెక్కించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గం అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని బుధవారం ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన ఆధారంగా దీపక్‌రెడ్డిపై అటు ఎమ్మెల్సీ మెట్టు, ఉషారాణి.. ఇటు కాలవ, బీకేలు గురువారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement