పోరుబిడ్డలు | The dream came true for Telangana people | Sakshi
Sakshi News home page

పోరుబిడ్డలు

Feb 19 2014 4:06 AM | Updated on Aug 18 2018 4:13 PM

దశాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలకఘట్టం పూర్తయింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయినప్పటినుంచి లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం వరకు మన జిల్లా నేతలదే కీలకపాత్ర. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత మొట్టమెదటిసారి కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన సభతో మలిదశ ఉద్యమానికి బీజం పడింది.

సాక్షి, కరీంనగర్ : దశాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలకఘట్టం పూర్తయింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయినప్పటినుంచి లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం వరకు మన జిల్లా నేతలదే కీలకపాత్ర. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత మొట్టమెదటిసారి కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన సభతో మలిదశ ఉద్యమానికి బీజం పడింది. అప్పటినుంచి ఉద్యమానికి సంబంధించిన ప్రతి మలుపులోనూ జిల్లా నేతల ముద్ర ఉంది. పదవులు వదులుకోవడానికీ... నిర్భంధాన్ని ఎదుర్కోవడానికీ వెరువకుండా ఉద్యమంలో ముందుండి నడిచారు.
 
 అన్ని సందర్భాల్లో ఉద్యమకారుల వెన్నంటి పోరుబిడ్డల్లా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇస్తూ కాంగ్రెస్ 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలవల్ల కేసీఆర్ కరీంనగర్ లోకసభ స్థానానికి 2006 సెప్టెంబర్‌లో రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఉద్యమం గమనంలో  కేసీఆర్ పిలుపునిచ్చినప్పుడల్లా ఆ పార్టీ శాసనసభ్యులు తటపటాయింపులు లేకుండా పదవులు వదులుకున్నారు. 2008లో మొదటిసారి ఐదుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో  కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు.  కేసీఆర్ దీక్ష ఫలితంగా 2009 డిసెంబర్9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు  కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రం వెనక్కి వెళ్లడంతో మరోసారి ఉద్యమం ఎగసిపడింది.
 
 రాజీనామాలతో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని టీఆర్‌ఎస్ భావించింది. ఇందుకోసం 2010లో మరోసారి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ప్రత్యేక ఆకాంక్షను సాధించడానికి పదవులు వదులుకున్నారు. అటు సభలోనూ , ఇటూ ప్రజాక్షేత్రంలోనూ టీఆర్‌ఎస్ శాసనసభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఎమ్మెల్యేలైనా చాలా సార్లు అరెస్టయ్యారు. నిర్బంధాన్ని చవిచూశారు. సకల జనుల సమ్మెను చరిత్రాత్మకంగా మలిచిన ఉద్యోగుల నేత స్వామిగౌడ్‌తోపాటు ఉపాధ్యాయ నాయకుడు సుధాకరరెడ్డి శాసనమండలికి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. ఉద్యమంలో నిర్వహించిన పాత్ర వారి విజయానికి కారణమైంది.
 
 డిసెంబర్ 9 ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్లిన తరువాత ఉద్యమం మరింత ఉధృతమైంది. జేఏసీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా ఆందోళనలు జరిగాయి. తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో పొన్నం ప్రభాకర్ ఇతర ఎంపీలతో కలిసి జోరుగా లాబీయింగ్ చేశారు. జేఏసీ నిర్వహించిన సాగరహారం కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ పొన్నం చొరవతో కాంగ్రెస్ ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జేఏసీ పిలుపు మేరకు రైలురోకోకు సిద్ధమైన పొన్నం జైలుకు కూడా వెళ్లారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ఆయన సమర్ధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.
 
 సీఎం వస్తే హెలికాప్టర్‌ను పేల్చివేస్తామన్న ఎంపీ వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా లగడపాటిని అడ్డుకునే ప్రయత్నం లో పెప్పర్ స్ప్రే వల్ల ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కీలక సమయంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు శాసనసభలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
 
 శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా రాష్ట్రపతి నుంచి వచ్చిన తెలంగాణ బిల్లును అడ్డంకులు లేకుండా సభలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారు. రాత్రికి రాత్రి తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తొలగించడంతో పదవికి రాజీనామా చేసి సీఎంకు సవాల్ విసిరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనీ కోరుతున్నా పట్టించుకోకుండా జాప్యం చేయడంతో ఎంపీ వివేకానంద కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కూడా కీలక ఘట్టమే. ఆ తరువాతే తెలంగాణ ప్రక్రియ వేగాన్ని అందుకుంది.

తెలుగుదేశం పార్టీ ద్వంద్వవైఖరి పట్ల జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఉప ఎన్నికలతోపాటు అనేక సందర్భాల్లో టీడీపీ  నేతలు పరాభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ 2009లోనే టీడీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరగా, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గతేడాది గులాబీ శిబిరంలో చేరారు. ప్రజాప్రతినిధులతోపాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు కూడా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement