ఉద్యోగాల పేరిట మోసం చేసిన ముఠా అరెస్ట్ | The arrest of the gang in the name of job fraud | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట మోసం చేసిన ముఠా అరెస్ట్

Jul 19 2014 2:53 AM | Updated on Aug 21 2018 5:46 PM

ఉద్యోగాల పేరిట మోసం చేసిన ముఠా అరెస్ట్ - Sakshi

ఉద్యోగాల పేరిట మోసం చేసిన ముఠా అరెస్ట్

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ జాతీయ స్థాయిలో మోసం చేస్తున్న ముఠాను ఒంగోలు తాలూకా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ఒంగోలు క్రైం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ జాతీయ స్థాయిలో మోసం చేస్తున్న ముఠాను ఒంగోలు తాలూకా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన పూరి పట్టణ నివాసి సమర్‌జిత్‌రౌట్ అలియాస్ అజయ్‌తోపాటు ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
 
 ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఐ.శ్రీనివాసన్ ఈ ముఠా చేసినా మోసాలను వెల్లడించారు. రాష్ట్రంతో పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎంతో మందిని మోసం చేశారని సీఐ వెల్లడించారు.
 
 రైల్వే ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాలిప్పిస్తామంటూ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు ఆర్జించారన్నారు. ఒడిశా రాష్ట్రం పూరి పట్టణానికి చెందిన సమర్‌జిత్‌రౌట్ ప్రధాన సూత్రధారిగా ఈ మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇతను రాష్ట్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని  దందాకు దిగాడన్నారు. సికింద్రాబాద్ సైనిక్‌పూరికి చెందిన గోళ్ల విక్రమ్, ఒంగోలు గోపాల్‌నగర్‌కు చెందిన నాగూర్ షరీఫ్, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నక్కా ప్రవీణ్‌కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన సూరకంటి పద్మారెడ్డి, పార్థసారథి రాజేంద్రన్ అలియాస్ మధు,  కోల్‌కతాకు చెందిన అజయ్‌ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రితో పాటు మరికొన్ని పట్టణాల్లో అనేక మంది నిరుద్యోగులను మోసం చేశారని వివరించారు.

 నిరుద్యోగులకు తప్పుడు వైద్య పరీక్షలు చేయించి నకిలీ అపాయింట్‌మెంట్ పత్రాలిచ్చి డబ్బులు వసూలు చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్నారు. ఒంగోలు దత్తాత్రేయ కాలనీకి చెందిన పోలిశెట్టి రవికుమార్‌కు రైల్వే టీసీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దర్శికి చెందిన సానె శివకృష్ణకు ఒంగోలు రైల్వేస్టేషన్‌లో టీసీ ఉద్యోగం ఇప్పించామంటూ తప్పుడు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చి రూ.7.50 లక్షలు మోసం చేశారన్నారు.

చందలూరుకు చెందిన పెంట్యాల సాయికృష్ణ నుంచి రూ.6 లక్షలు వసూలు చేసి కోల్‌కతాలో రైల్వే టీసీ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసినట్లు వివరించారు.   ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులు భరత్‌చంద్ర, కేశవ్‌కళ్యాణ్, సుభాని, మహేష్‌చౌదరి, పార్థసారథి రాజేంద్రన్ పరారీలో ఉన్నారన్నారు. వీరి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ ప్రమోద్ కుమార్  తనతోపాటు ఎస్సై రంగనాధ్, సిబ్బందిని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement