రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 9, 10 షెడ్యూళ్లలో చేర్చని 37 సంస్థలను న్యాయ పోరాటం ద్వారానైనా రక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 9, 10 షెడ్యూళ్లలో చేర్చని 37 సంస్థలను న్యాయ పోరాటం ద్వారానైనా రక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్‌లో చేర్చని ఈ సంస్థలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ సోమవారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తొలుత తెలంగాణ ప్రభుత్వంతో చర్చల ద్వారా ఆ సంస్థలు కొంతకాలం పాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి సేవలందించేలా చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇది సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడా పరిష్కారం లభించకపోతే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సంస్థలను పదో షెడ్యూల్‌లో చేర్చాలని గవర్నర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పదో షెడ్యూల్‌లో చేర్చాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంది.
ఈలోగా తెలంగాణ ప్రభుత్వం జంట నగరాల్లోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్చడ, నాక్‌కు డెరైక్టర్ జనరల్‌ను నియమించడం వంటి చర్యలను చేపట్టింది. ఈ 37 సంస్థల్లో కొన్ని భౌగోళికంగా తెలంగాణలో, కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. అయితే తెలంగాణలో ఉన్న సంస్థలన్నీ తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.