ఆణిముత్యాలకు కష్టాలు | tenth class Difficulties | Sakshi
Sakshi News home page

ఆణిముత్యాలకు కష్టాలు

Jun 17 2014 2:36 AM | Updated on Jun 1 2018 8:39 PM

ఆణిముత్యాలకు కష్టాలు - Sakshi

ఆణిముత్యాలకు కష్టాలు

అనంత ఆణిముత్యాలు.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో రెసిడెన్షియల్ సదుపాయంతో ఉచితంగా చదివించడం ఈ పథకం లక్ష్యం.

అనంతపురం ఎడ్యుకేషన్ : అనంత ఆణిముత్యాలు.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో రెసిడెన్షియల్ సదుపాయంతో ఉచితంగా చదివించడం ఈ పథకం లక్ష్యం. దీనికి 2006లో అప్పటి కలెక్టర్ శ్రీధర్ ‘అనంత ఆణిముత్యాలు’గా నామకరణం చేశారు. ఒక్కో జిల్లాలో ఒక్కో పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కులాలు, పాఠశాలల ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. గత విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమై పక్షం రోజులవుతున్నా ఇప్పటి వరకు కనీసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. ఫలితంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

ముందుగా ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు ఓ వెబ్‌సైట్ (apepass.cgg.gov.in) ఇచ్చారు. అందులోకి వెళ్తే దరఖాస్తు కన్పించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో టెక్నికల్ సమస్యలు వచ్చాయని గ్రహించి తిరిగి ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. ఈ ప్రకటన వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి కీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు సాఫ్ట్‌వేర్ జాడ కన్పించడం లేదు. దాన్ని పొందుపరచక పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు రోజూ ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

హార్ట్‌కాపీలు తీసుకుంటారనే ఆశతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ధర్మవరం పట్టణానికి చెందిన రంగయ్య సోమవారం ‘సాక్షి’తో వాపోయారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హార్డ్‌కాపీలు తీసుకోమని, ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సాఫ్ట్‌వేర్ ఎప్పుడు పొందు పరుస్తారో ఇక్కడి అధికారులకు కూడా సరైన సమాచారం లేదు. దీంతో వారుకూడా ఈ రోజు.. రేపు అంటున్నారు తప్ప ఖచ్చితమైన సమయం చెప్పడం లేదు.

డోలాయమానంలో విద్యార్థులు
అనంత ఆణిముత్యాలు పథకానికి నిరుపేద విద్యార్థులే దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఇప్పటిదాకా కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కళాశాలలు ప్రారంభమై తరగతులు జరుగుతుంటే వీరంతా ఎదురుచూస్తున్నారు. పోనీ కళాశాలల్లో చేరేద్దామంటే ఆర్థికభారం. అలాగని వేచిచూద్దామంటే ఈ ఎంపిక ప్రక్రియ ఎప్పుడు ప్రారంభవుతుందో తెలీదు. చాలామంది విద్యార్థులు దిక్కుతెలీక డోలాయమానంలో పడ్డారు. వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement