గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డికి అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ఉపాధ్యాయుల ఆందోళనలతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
- పోటాపోటీగా ఉపాధ్యాయ సంఘాల ధర్నా
పాడేరు: గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డికి అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ఉపాధ్యాయుల ఆందోళనలతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీడీ గిరిజన విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారంటూ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం, తప్పుడు విధానాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ డీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.
ఎవరికి వారు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఒకదశలో ఉపాధ్యాయ సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పీవో వాహనం నిలిపి ఉన్న ప్రాంతంలో రెండు సంఘాల వారు పెద్ద ఎత్తున నినాదాలతో గందరగోళం నెలకొంది.
దీంతో సీఐ ఎన్.సాయి, ఎస్‌ఐ ధనుంజయరావులు సిబ్బందితో అక్కడకి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలతో పోలీసు అధికారులు చర్చలు జరిపి శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో ఒక సంఘం నాయకుల తరువాత మరొకరు పీవోను కలవడానికి పోలీసులు అనుమతించారు. మద్దతుదారులను ఐటీడీఏ గేటు వద్దే నిలిపివేయడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ సంఘాల మధ్య వివాదం ఇక్కడ చర్చనీయాంశమైంది.