కరెంటు కష్టాలకు తాత్కాలిక ‘విరామం’ | Temperory relief to electricity problems | Sakshi
Sakshi News home page

కరెంటు కష్టాలకు తాత్కాలిక ‘విరామం’

Oct 11 2013 2:14 AM | Updated on Sep 18 2018 8:38 PM

విద్యుత్ ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు పడుతున్న కరెంటు కష్టాలకు విరామమిచ్చినట్లు అయ్యింది.

సాక్షి, మచిలీపట్నం : విద్యుత్ ఉద్యోగులు  తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు పడుతున్న కరెంటు కష్టాలకు  విరామమిచ్చినట్లు అయ్యింది.  ఫైలిన్ తుఫాన్, దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని సమ్మెను వాయిదా వేస్తున్నామని, ఇది తాత్కాలికమేమనని, కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మళ్లీ సమ్మెబాట పడతామని వారు ఘాటుగానే ప్రకటించారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నోట్‌ను ఆమోదించడంతో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో సుమారు 30వేల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ట్రాన్స్‌కో ఉద్యోగులు సుమారు మూడు వేల మంది, జెన్‌కో ఉద్యోగులు సుమారు 5వేల మంది ఐదు రోజులుగా సమ్మెలో పాల్గొన్నారు. వీరి సమ్మెతో ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌లో  విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జిల్లాతోపాటు పొరుగు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాపై తీవ్రప్రభావం పడింది.

క్రమంగా విద్యుత్ కొరత తీవ్రం  కావడంతో జిల్లాలో ఆరు గంటల నుంచి 12గంటలకు విద్యుత్ కోతలు పెరిగాయి. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతూనే ప్రజలు ఉద్యమస్ఫూర్తితో సహకరించారు. జిల్లాలో 970గ్రామాలకు గానూ దాదాపు 600గ్రామాలకు పైగా మంచినీటి సరఫరాపై విద్యుత్ కోతలు తీవ్ర ప్రభావం చూపించాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అరకొరగానే మంచినీటి సరఫరా చేసి సరిపెట్టారు. వీధిలైట్లు సైతం వెలగలేదు. జిల్లాలో అంతంతమాత్రంగా పనిచేస్తున్న సుమారు 571రైస్‌మిల్లులతోపాటు, 59ఐస్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో సుమారు 5వేల చిన్న, పెద్ద పరిశ్రమలకు విద్యుత్ కోతలు నష్టాల వాత పెట్టాయి. చిరువ్యాపారులు కరెంటు కోతలతో ఇబ్బంది పడ్డారు.
 
సీమాంధ్రలో కోతలు.. తెలంగాణాలో వెలుగులు

 విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో కొత్త కోణం వెలుగు చూసింది. పాలకుల పక్షపాతం బయటపడింది. అసలు సంగతేమిటంటే విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర లో విద్యుత్ కోతలు విధించిన ప్రభుత్వం తెలంగాణా ప్రాంతంలో మాత్రం నిరంతరాయంగా విద్యుత్  సరఫరా చేసింది. గతంలో తెలంగాణా రాష్ట్రం కోసం ఆ ప్రాంతం లో పెద్ద ఎత్తున జరిగిన సకల జనుల సమ్మెలో అక్కడ విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

దీంతో అక్కడ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి తెలంగాణాలో కరెంటు కోతలు అమలు చేయాల్సి రావడంతో మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన కరెంటును అక్కడ సరఫరా చేసి అప్పుడు కూడా సీమాంధ్రలోనే కోతలు పెట్టారు. ఇప్పుడు జరిగిన సమ్మె తో ప్రభుత్వం తెలంగాణాకు కరెంటు కోతలు లేకుండా, సీమాంధ్రలోనే కోతలు అమలు చేసింది. తెలంగాణాలో సమ్మె జరిగినా, సీమాంధ్రలో ఉద్యమం జరిగినా కరెంటు కోతలు మాత్రం సీమాంధ్ర వాసులే భరించాల్సి రావడం శోచనీయమని ప్రజలు పేర్కొంటున్నారు.
 
కరెంటు కోతలు తగ్గేనా..

 విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి విధుల్లోకి చేరనున్నారు. దీంతో సరఫరా దారిలోకి వస్తుందని అంటున్నారు. కాగా, వీటీపీఎస్ ఉత్పత్తి దారిలో పడటానికి మరో రోజు పడుతుందని చెబుతున్నారు. కరెంటు ఉత్పత్తి జరగడం, జిల్లాలో పలు సబ్‌స్టేషన్ల పరిధిలో సరఫరాకు గల అంతరాయాలు తొలగించాల్సి ఉంది. ఉద్యోగులు విధుల్లోకి చేరితే కరెంటు కోతలు ఒకటి రోజులు నామమాత్రంగానే అమలు చేసి, తరువాత పూర్తిస్థాయిలో కోతలు ఎత్తివేస్తారని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement