రాష్ట్రాలు విడిపోయినా.. ఆర్టీసీని విభజించరా?
రాష్ట్రం విడిపోయినా రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉమ్మడిగా కొనసాగుతుండటాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది
-
టీఎస్‌ఆర్టీసీపై సర్కారు కసరత్తు
-
కేంద్రం కాలయాపనపై సర్కార్ అసహనం
-
టీఎస్ ఆర్టీసీ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వండి
-
మంత్రులు హరీశ్, మహేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉమ్మడిగా కొనసాగుతుండటాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల విషయంలో కేంద్రం కాలయాపన చేస్తుండటంతో అసహనంగా ఉన్న సర్కారు.. ఆస్తులు, అప్పుల కేటాయింపుతో విభజనను ముడిపెట్టొద్దని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖకు దరఖాస్తు చేసి తెలంగాణకు ప్రత్యేక రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఏపీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. దీంతో తెలంగాణకు చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారి రమణరావును రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి జేఎండీగా నియమించి నెట్టుకురావాల్సి వస్తోంది. ఈ నేపథ్యం లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సాంకేతి కంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చివరకు బోర్డు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుపై దృష్టి సారించారు. దీని సాధ్యాసాధ్యాలపై చర్చించి నివేదిక ఇవ్వాల్సిందిగా మం త్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలను ఆదేశించారు.
దీంతో వారిద్దరూ గురువారం ఆర్టీసీ అధికారులు, టీఎంయూ నేతలతో సమావేశమయ్యారు. టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతిం చాల్సిందిగా కేంద్ర ఉపరితల రవాణా శాఖకు దరఖాస్తు చేసే అంశంపై ప్రధానంగా చర్చిం చారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి వారం పదిరోజుల్లో ఈ కమిటీ కేంద్ర ఉపరితల రవాణాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దరఖాస్తు సమర్పించాలని నిర్ణయించారు.
అలాగే ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే తమకు తెలంగాణ ఇంక్రిమెంటును వర్తింపజేయాలన్న ఆర్టీసీ కార్మికుల అభ్యర్థనపై చర్చించారు. టీఎస్ ఆర్టీసీ ఏర్పడగానే ఈ ఇంక్రిమెంటును వర్తింపజేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, ముంబై సిటీ బస్సులను నిర్వహిస్తున్న తీరును అధ్యయనం చేసేందుకు ఉన్నతస్థాయి బృందం ఈనెల 21, 22 తేదీల్లో అక్కడ పర్యటించనుంది. మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, రవాణాశాఖ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు.