తెలగ కుల పిక్నిక్‌లో రాజకీయ చిచ్చు | Sakshi
Sakshi News home page

తెలగ కుల పిక్నిక్‌లో రాజకీయ చిచ్చు

Published Mon, Dec 28 2015 12:28 AM

Telaga caste welfare community picnic in srikakulam

మంత్రి అచ్చెన్నకు ఆహ్వానంపై రగడ
  దూరంగా ఉన్న రొక్కం దొరలు

 
 కోటబొమ్మాళి: తెలగ కుల వనసమారాధనకు రాజకీయ రంగు పులుముకుంది. ఏటా ప్రశాంతంగా జరిగే ఈ పిక్నిక్ ఈ ఏడాది పేవలంగా మారింది. కోటబొమ్మాళిలో ఆదివారం ఏర్పాటు చేసిన తెలగ కుల సంక్షేమ సంఘ పిక్నిక్‌కు ఇటు రొక్కం దొరలు, అటు మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకాలేవు. ఎంతో వైభవంగా జరుగుతుందనుకున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం భోజనాలు తర్వాత నీరసగా ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుని సంఘ ప్రతినిధులు ఆహ్వానించడంతో జీర్ణించుకోలేని కురుడు దొరలుగా గుర్తింపు పొందిన సంఘ గౌరవ అధ్యక్షుడు రొక్కం మధుబాబు, గౌరవ సలహాదారులు రొక్కం అచ్చుతరావు, మండపాక నర్సింగరావు, రొక్కం సూర్యప్రకాశరావు, రొక్కం సత్యనారాయణ, వంటి ప్రముఖులు వనసమారాధనకు హాజరు కాలేదు.
 
  తెలగ కులస్తులను బీసీల్లో చేర్చాలని గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న తరుణంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు చెందిన తెలగ కుల సంఘ ప్రతినిధులు మంత్రి, ఎంపీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రిని సన్మానించేందుకు నిర్ణయించారు. దీనికి ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు అడ్డుచెప్పడంతో తెలగ కులంలో సంక్షోభం చెలరేగింది. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు ఆహ్వానాన్ని జీర్ణించుకోలేని కురుడు, చిన్నసాన, వల్లేవలస తదితర గ్రామాల పెద్దలు పిక్నిక్‌కు హాజరు కాలేదని తెలిసింది.
 
 తప్పించుకున్న అచ్చెన్న
 ఇదిలావుండగా తెలగకుల సంక్షేమం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని పిక్నిక్‌కు ఆహ్వానించడం ఆనవాయితీ అని, అంతమాత్రాన ఈ కార్యక్రమానికి రాజకీయ బురద అంటకట్టడం సమంజసం కాదని కింది స్థాయి తెలగ కుల సంఘ ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఎంతో ఆదరాభిమానాలతో అచ్చెన్నాయుడిని వనసమారాధనకు ఆహ్వానిస్తే తెలగ కులాన్ని బీసీల్లో కలపమని కోరుతారేమోనన్న భయంతోనే ఆయన హాజరుకాకుండా తప్పించుకున్నారని తెలగ కులానికి చెందిన నిరుద్యోగ యువకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు పుణ్యమా అని జిల్లాలో తెలగ కుల సంఘం రెండు ముక్కలుగా చీలిపోయిందని చెప్పక తప్పదు.
 

Advertisement
Advertisement