విందు పాఠం... నీతి బోధన

Teachers Closed School For Dinner in Anantapur - Sakshi

విందుకోసం సీకే పల్లిలో స్కూళ్ల మూత    

యల్లనూరులో భోజన తనిఖీకి వెళ్లిన ఎంఈఓపై టీచర్‌ చిర్రుబుర్రు

అనంతపురం, చెన్నేకొత్తపల్లి/యల్లనూరు: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన గురువులు దారి తప్పారు. బదిలీపై వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు ఇస్తున్న విందు కోసం చెన్నేకొత్తపల్లి మండలంలోని స్కూళ్లకు శుక్రవారం అనధికార సెలవు ప్రకటించారు. విద్యార్థులంతా ఇంటిబాట పట్టగా.. సార్లంతా విందు వినోదంలో మునిగిపోయారు. ఇక యల్లనూరు జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన తనిఖీకి వెళ్లిన ఎంఈఓపై ఓ ఉపాధ్యాయుడు ఎదురు తిరిగాడు. ‘‘నువ్వు ఏమైనా నీతిమంతునివా.. నీకే అధికారం ఉంది’’ అంటూ నీతి బోధన చేశారు.

స్కూళ్లన్నీ మూత
చెన్నేకొత్తపల్లి మండలంలోని బసంపల్లి ప్రాథమిక పాఠశాల టీచర్‌ మారెప్ప పదోన్నతిపై కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురానికి బదిలీ అయ్యారు. ఆయనకు రాజకీయంగా బాగా పలుకుబడి ఉంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పరిటాల సునీతకు టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశాడు. అంతటి ఘన చరిత్ర కలిగిన అయ్యవారు బదిలీ కాగా.. శుక్రవారం చెన్నేకొత్తపల్లిలో విందు ఏర్పాటు చేశారు. మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఆహ్వానం పంపారు. సారు పిలిస్తే వెళ్లకపోతే మాటొస్తుందని భావించిన మండలంలోని ఉపాధ్యాయులంతా విందులో పాల్గొనేందుకు అనుమతివ్వాలని ఎంఈఓ రాజశేఖర్‌పై ఒత్తిడి తెచ్చారు. స్కూళ్లు మూతపడితే తనకు మాటొస్తుందని, పైగా వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న తనకెందుకీ తలనొప్పని భావించిన ఎంఈఓ శుక్రవారం సెలవులో వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యాయులు స్కూళ్లకు అనధికార సెలవు ప్రకటించి సీకేపల్లికి వెళ్లగా.. విద్యార్థులంతా ఇంటిబాట పట్టారు. దీనిపై ఎంఈఓ రాజశేఖర్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా.. అధికారికంగా సెలవు ఇవ్వనప్పటికీ మండలంలోని పాఠశాలలు మూతపడిన విషయం వాస్తవమేనన్నారు. సదరు ఉపాధ్యాయులపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. 

యల్లనూరు పాఠశాలలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఇన్‌చార్జి తహసీల్దార్‌ సురేష్‌ బాబు,  ఎంఈఓ చంద్రశేఖర్‌
ఎంఈఓపై ఎదురుదాడి
యల్లనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ సురేష్‌ బాబు, ఎంఈఓ చంద్రశేఖర్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను వారు పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రోజు వారీ మెనూ, రికార్డులను తనిఖీ చేశారు. మూడు నెలలుగా రికార్డులు నమోదు చేయకపోవడంతో పాటు, పిల్లలకు రోజు వారీ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని వారు గుర్తించారు. దీనిపై ఉపాధ్యాయులను ప్రశ్నించగా సూర్యనారాయణ అనే ఉపాధ్యాయుడు ఎదురు దాడి చేశారు.

నీకేం అధికారం ఉంది
‘‘మీరంతా నీతిపరులు పాపం.. అయినా మా పాఠశాలకు ఎందుకు వచ్చావ్‌..’’ అంటూ పాఠశాలలోని సూర్యనారాయణ అనే  ఉపాధ్యాయుడు ఎంఈఓ చంద్రశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా ఉన్నత పాఠశాలకు రావడానికి నీకు ఏం అధికారం ఉందని ప్రశ్నించాడు. ‘‘నీకే కాదు.. మాకూ ఉన్నాయి తెలివితేటలు. కావాలంటే మేము కూడా తెచ్చుకోగలం పేపర్లు.. నీవు మా పాఠశాలకు వచ్చి రాజకీయం చేస్తావా..? ఔ పాపం మీరంతా నీతిపరులు అయి మా పాఠశాలకు వచ్చారు’’ అంటూ సదరు ఉపాధ్యాయుడు నోరుపారేసుకున్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top