కల్తీ టీ పొడి విక్రయదారుడిపై విజి‘లెన్స్‌’

Tea Powder Adulteration In Krishna - Sakshi

నాన్‌ పర్మిటెడ్‌ కలర్‌ వినియోగిస్తున్న వైనం

ప్యాకింగ్‌ నిబంధనల ఉల్లంఘన

లక్ష రూపాయల విలువైన సరుకు సీజ్‌

భవానీపురం (విజయవాడ పశ్చిమ) : కల్తీ టీ పొడి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గొల్లపూడి పరిధిలోని మహాత్మాగాంధీ హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లోని ఓ హోల్‌సేల్‌ టీ మర్చంట్స్‌ దుకాణంపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కాంప్లెక్స్‌లోని 283వ నెంబర్‌ షాపులో సుమన్‌ అనే వ్యక్తి టీ పొడి హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తున్నారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి లూజు టీ పొడిని దిగుమతి చేసుకుని ఇక్కడ రీ ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. అయితే ప్యాకింగ్‌ సమయంలో కల్తీ చేయడం, నాన్‌ పర్మిటెడ్‌ కలర్స్‌ను కలపటం వంటి పనులతో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ వి. హర్షవర్ధన్‌ నేతృత్వంలో డీఎస్పీ ఆర్‌. విజయపాల్, ఫుడ్‌ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు తమ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. అక్కడ టీ పొడిని పరిశీలించగా ఎక్కువ మోతాదులో కలర్‌ కలిపినట్లు గుర్తించారు. అలా కలిపిన కలర్‌ను, కలర్‌ కలిపిన టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు లక్ష రూపాయలు విలువగల 450 కిలోల టీ పొడి బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కల్తీలపై అవగాహన కలిగి ఉండాలి..
ఆహార పదార్థాల కల్తీలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని విజిలెన్స్‌ ఎస్పీ హర్షవర్ధన్‌ తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నట్లు అనుమానం వస్తే విజిలెన్స్, ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఇక్కడ పట్టుబడిన కల్తీ టీ పొడి నమూనాలను సేకరించామని, వాటిని ల్యాబ్‌కు పంపి రిపోర్ట్‌ వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సువర్చల ట్రేడర్స్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తున్నామని, కల్తీ జరిగినట్లు రుజవైతే సుమారు 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మూడో రకం టీ పొడిని కిలో రూ.50–60లకు కొనుగోలు చేసి దానిలో కల్తీ కలిపి రీ ప్యాక్‌ చేసి రూ.150 వరకు అమ్ముతున్నారని తెలిపారు. 

జీర్ణకోశ వ్యవస్థ దెబ్బ తింటుంది..
లూజు టీ పొడిలో ఎటువంటి కలర్స్‌ కలపకూడదని, ఇక్కడ అమ్ముతున్న టీ పొడిలో నాన్‌ పర్మిటెడ్‌ కలర్స్‌ కలుపుతున్నట్లు గుర్తించామని ఫుడ్‌ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు చెప్పారు. కొంత మంది వ్యాపారులు వాడిన టీ పొడిని సేకరించి మామూలు టీ పొడిలో కలుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాగే టీ పొడిలో జీడిపిక్కల పౌడర్‌ను కలుపుతున్నారని చెప్పారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల వాడకంతో జీర్ణవ్యవస్ధ దెబ్బ తింటుందని, లివర్, కిడ్నీలపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ డీఎస్పీ ఆర్‌. విజయపాల్, తహసిల్దార్‌ వీఎం ఇందిరాదేవి, సీఐ ఎన్‌ఎస్‌ఎస్‌ అపర్ణ, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ బాలాజీ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top